
గురువారం తెలంగాణ సిఎం కేసీఆర్ బిహార్ రాజధాని పాట్నాకు వెళ్ళి ఆ రాష్ట్ర సిఎం నితీశ్ కుమార్తో భేటీ అయ్యి దేశరాజకీయాలపై చర్చించారు. అంతకు ముందు ఆయనతో కలిసి గాల్వాన్ అమరవీరుల కుటుంబాలకు, హైదరాబాద్లో స్క్రాప్ గోదాం ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరపున చెక్కులు అందజేశారు.
నితీశ్ కుమార్తో భేటీ ముగిసిన తర్వాత ప్రెస్మీట్లో మాట్లాడుతూ, మోడీ చేతకానితనం వలన దేశం అన్ని రంగాలలో వెనకబడిపోతోందని, మోడీ ప్రభుత్వం రాష్ట్రాల హక్కులు హరించివేస్తోందని సిఎం కేసీఆర్ విమర్శలు గుప్పించారు. దేశంలో సహజవనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ మోడీ ప్రభుత్వానికి వాటిని ఉపయోగించుకోవడం చేతకాకపోవడం వలననే దేశం ఇంత వెనకబడిపోయిందని అన్నారు. ఇంకా ఈ భూటకపు మాటలు, హామీలు, నినాదాలతో మభ్య పెట్టే పార్టీలు దేశానికి అవసరం లేదని దేశాన్ని అభివృద్ధిపదంలో నడిపించే ప్రభుత్వం అవసరమని అన్నారు. కేంద్రంలో బిజెపిని గద్దె దించేందుకు బిజెపి వ్యతిరేక శక్తులు అన్నీ ఏకంకావాలని అన్నారు. వాటికి ఎవరు నాయకత్వం వహించాలనేది తదుపరి చర్చలలో నిర్ణయించుకొంటామని కేసీఆర్ చెప్పారు.