
ఒకప్పుడు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రిగా ఓ వెలుగు వెలిగిన కడియం శ్రీహరిని సిఎం కేసీఆర్ ఎందుకు పక్కన పెట్టేశారో తెలీదు. గత ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలతో ఉప ముఖ్యమంత్రి పదవిలో నుంచి తొలగింపబడిన తాడికొండ రాజయ్యకు సిఎం కేసీఆర్ మళ్ళీ స్టేషన్ ఘన్‌పూర్ నుంచి పోటీ చేసేందుకు టికెట్ ఎందుకు ఇచ్చారో తెలీదు. కానీ అప్పటి నుంచి వారిరువురూ ఘర్షణ పడుతూనే ఉన్నారు.
రాజయ్యకు మళ్ళీ టికెట్ వచ్చి ఎమ్మెల్యే కావడంతో తరచూ కడియంను ఎగతాళి చేస్తుంటారు. సవాళ్ళు చేస్తుంటారు. కానీ కడియం అంత త్వరగా బయటపడే వ్యక్తి కాదు కనుక చాలా సంయమనం పాటిస్తూ హుందాగా వ్యవహరిస్తున్నారు. కానీ ఇటీవల రాజయ్య పదేపదే ఆయనపై విమర్శలు గుప్పిస్తుండటంతో తొలిసారిగా కడియం కూడా స్పందించారు.
జనగామలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్‌పై గౌరవంతో పార్టీకి కట్టుబడి నేను మౌనం వహిస్తున్నాను తప్ప జవాబు చెప్పడం చేతకాక కాదు. మధ్యాహ్నమే తప్పతాగి నోటికి వచ్చినట్లు మాట్లాడే వ్యక్తి రాజయ్య. అటువంటి వ్యక్తి మాటలకు జవాబు చెప్పాల్సిన అవసరం నాకు లేదు.
దళిత బంధు పధకం ఇప్పిస్తానని ఆయన ఎంత మంది దగ్గర దావతులు తీసుకొన్నాడో నాకు తెలుసు. తప్పతాగి ఏమేమి మాటాడుతున్నాడో, ఎలాంటి వెర్రి పనులు చేస్తున్నాడో నాకు తెలుసు. అతని రికార్డ్ మొత్తం నా దగ్గర ఉంది. దానిని బయటపెడితే మళ్ళీ తలెత్తుకొని ప్రజల మద్య తిరగలేడు.
స్టేషన్ ఘన్‌పూర్ ప్రజలలో నాకున్న విలువ ఏమిటో, అతనికి ఉన్న విలువ ఏమిటో అందరికీ తెలుసు. కావాలంటే పార్టీకి అతీతంగా సర్వే చేయించుకొని ప్రజాభిప్రాయం ఏమిటో తెలుసుకొందామా?ఎవరికి ప్రజాధారణ ఉందో తెలుసుకొందామా? అని సవాల్ చేస్తున్నాను.
మనం ప్రజలకు మేలు కలిగే మంచి పనులు చేస్తే ప్రజలు ఆదరిస్తారు. ఇలా తప్పతాగి మాట్లాడుతుంటే ప్రజలే బుద్ది చెపుతారు. నా గురించి రాజయ్య మాట్లాడిన మాటలకు క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ విషయం తప్పకుండా సిఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళతాను,” అని కడియం శ్రీహరి అన్నారు.