సిఎం కేసీఆర్‌ రేపు బిహార్‌ పర్యటన!

సిఎం కేసీఆర్‌ రేపు (బుదవారం) బిహార్‌ పర్యటనకు వెళ్ళబోతున్నారు. ఇటీవల బిహార్‌ సిఎం నితీశ్ కుమార్‌ బిజెపితో తెగ తెంపులు చేసుకొని ఆర్‌జెడీ మద్దతుతో మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటుచేసుకొన్న సంగతి తెలిసిందే. సిఎం కేసీఆర్‌ బిజెపిపై మొదలుపెట్టిన యుద్ధంలో ఉత్తరాది రాష్ట్రాలలో చాలా శక్తివంతుడైన నితీశ్ కుమార్‌తో దోస్తీ చాలా ఉపకరిస్తుంది కనుక నితీశ్ కుమార్‌ను కలిసేందుకు రేపు పాట్నా బయలుదేరుతున్నారు. 

బుదవారం ఉదయం బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం బిహార్‌ రాజధాని పాట్నా చేరుకొంటారు. మధ్యాహ్నం నితీశ్ కుమార్‌తో కలిసి భోజనం చేస్తారు. బిజెపి వ్యతిరేక శక్తులను ఏవిదంగా ఏకం చేయాలనే దానిపై వారిరువురూ చర్చిస్తారు. 

అనంతరం, వారిరువురూ కలిసి గాల్వాన్ లోయలో చైనా సైనికులను అడ్డుకొనే ప్రయత్నంలో మరణించిన ఐదుగురు సైనికుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.10 లక్షల చొప్పున తెలంగాణ ప్రభుత్వం తరపున చెక్కుల అందజేస్తారు. ఈ ఏడాది మార్చిలో హైదరాబాద్‌ బోయగూడలోని ఓ ఇనుప స్క్రాప్ దుకాణంలో అగ్నిప్రమాదం జరిగినప్పుడు బిహార్‌కు చెందిన 12 మంది వలస కార్మికులు చనిపోయారు. వారి కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.5 లక్షలు చొప్పున సిఎం కేసీఆర్‌ అందజేస్తారు. ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత సిఎం కేసీఆర్‌ మళ్ళీ ప్రత్యేక విమానంలో పాట్నా నుంచి హైదరాబాద్‌ తిరుగు ప్రయాణం అవుతారు.