తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం మరో షాక్

ప్రధాని నరేంద్రమోడీపై సిఎం కేసీఆర్‌, మంత్రులు విమర్శలు తీవ్రం అవుతున్నకొద్దీ అటునుంచి కూడా పైకి కనబడని ఆంక్షలు, ఒత్తిడి పెరిగిపోతున్నాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రుణాలు తీసుకోకుండా కేంద్రం కొన్ని ఆంక్షలు విధించి చేతులు కట్టేసింది. తర్వాత విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు తెలంగాణ డిస్కంలు సకాలంలో బకాయిలు చెల్లించలేదంటూ విద్యుత్‌ ఎక్స్‌ఛేంజ్ నుంచి రాష్ట్రానికి అవసరమైన విద్యుత్‌ కొనుగోలు చేయడానికి, మిగిలు విద్యుత్‌ అమ్ముకోవడానికి వీలులేకుండా తాత్కాలిక నిషేదం విదించింది.    

తాజాగా ఏపీ ప్రభుత్వం అభ్యర్ధన మేరకు ఏపీ విద్యుత్‌ సంస్థలకు చెల్లించాల్సిన రూ.3,441.78 కోట్లకు ఆలస్య రుసుము రూ.3,315.14 కోట్లతో కలిపి మొత్తం రూ.6,756.92 కోట్లు నెలరోజుల లోపుగా చెల్లించాలని కేంద్ర ప్రభుత్వ ఉపకార్యదర్శి అనూప్ సింగ్ బిస్త్ సోమవారం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించారు. 

రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఆదేశం మేరకు ఏపీ జెన్‌కో తెలంగాణకు 8,890 మిలియన్ యూనిట్లు విద్యుత్‌ సరఫరా చేసింది. దానికి తెలంగాణ ప్రభుత్వం రూ.3,441.78 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే ఏపీ ప్రభుత్వం కూడా సింగరేణికి, ఇతర పద్దుల కింద తెలంగాణ ప్రభుత్వానికి రూ.12,900 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉందని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. వాటి గురించి ఎన్నిసార్లు అడిగినా ఏపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండూ పట్టించుకోలేదు. కానీ ఏపీకి నెలరోజులలో బకాయిలు చెల్లించాలని హుకుం జారీ చేయడం తెలంగాణ ప్రభుత్వం పట్ల కక్ష సాధింపు చర్యే. తెలంగాణను మళ్ళీ చీకట్లోకి నెట్టాలని కేంద్రం కుట్ర పన్నుతోంది అని అన్నారు.