30.jpg)
ఈరోజు సిఎం కేసీఆర్ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ప్రారంభించిన తర్వాత బహిరంగసభలో ప్రసంగించినప్పుడు ఆయనలో కొత్త ఉత్సాహం చాలా స్పష్టంగా కనిపించింది. అది 26 రాష్ట్రాల నుంచి వచ్చిన రైతు సంఘాల నేతల నుంచి వచ్చిన సానుకూల స్పందన వలననే అని ఆయన మాటల్లోనే వ్యక్తం అయ్యింది. ఈసారి కేసీఆర్ జాతీయ రాజకీయాల గురించి ఎక్కువ మాట్లాడారు.
దేశంలో 26 రాష్ట్రాల నుంచి రైతు సంఘాల నేతలు తెలంగాణ అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పధకాలను స్వయంగా చూసిన తర్వాత తమ తమ రాష్ట్రాలలో ఇటువంటి గొప్ప పధకాలు ఏ ఒక్కటీ అమలు కావడం లేదని చెప్పారన్నారు. ప్రధాని మోడీ ఎంతగానో అభివృద్ధి చేశానని చెప్పుకొంటున్న ఆయన సొంత రాష్ట్రంలో కరెంటు కోతలు తప్పడం లేదని, గాంధీ నడయాడిన ఆ రాష్ట్రంలో కల్తీ మద్యం ఎరులైపారుతోందని, పింఛనులు, సంక్షేమ పధకాలు లేవని అక్కడి నుంచి వచ్చిన రైతులు చెప్పారన్నారు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పధకాలు చూసిన తర్వాత తమ రాష్ట్రాలలో కూడా ఇటువంటివి కావాలని వారు కోరుకొన్నారని చెప్పారు. తనను జాతీయ రాజకీయాలలోకి రావాలని రైతులు ఆహ్వానించారని సిఎం కేసీఆర్ చెప్పారు.
ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ ప్రధాని నరేంద్రమోడీ అసమర్దుడని మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఈ 8 ఏళ్లలో తాను తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి చూపితే, ప్రధాని నరేంద్రమోడీ తన చేతకానితనంతో దేశాన్ని భ్రష్టు పట్టించేశారని సిఎం కేసీఆర్ విమర్శించారు. కనుక ఈ పెద్దపల్లి నుంచే ప్రకటిస్తున్నాను... కేంద్రంలోని మోడీ/బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించి రైతు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాను,” అని అన్నారు.