
పాతబస్తీ ప్రజలు ఎన్నాళగానో ఎదురుచూస్తున్న చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం అయింది. మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, డెప్యూటీ మేయర్ శ్రీలత, మజ్లీస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నాలుగు రోజుల క్రితమే ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం జరగవలసి ఉండగా బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ అనుచిత వ్యాఖ్యలతో పాతబస్తీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండటంతో నేటికీ వాయిదా పడింది. పాతబస్తీలో భారీగా పోలీసులు మోహరించి ప్రజల కదలికలపై ఆంక్షలు విధించడంతో పరిస్థితులు మళ్ళీ సాధారణస్థితికి వస్తున్నాయి. రూ.45.79 కోట్లు వ్యయంతో చాంద్రాయణగుట్టలో నిర్మించిన ఫ్లైఓవర్‌ను రాష్ట్ర మునిసిపల్ మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించనున్నారు.
నాలుగు లేన్లతో నిర్మించబడిన ఈ ఫ్లైఓవర్ పొడవు 674 మీటర్లు. ఇంతకాలం వాహనదారులు కందికల్ గేట్, బార్కస్ జంక్షన్ల వద్ద ట్రాఫిక్‌లో చిక్కుకొని నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఫ్లైఓవర్‌తో ఈ మూడు జంక్షన్స్ మీదుగా ఎక్కడా ఆగకుండా వెళ్ళిపోవచ్చు. ఈ ఫ్లైఓవర్ నిర్మిస్తున్నప్పుడే దాని అప్రోచ్ రోడ్ కూడా విస్తరించినందున శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఎల్బీనగర్ మీదుగా మరింత సౌకర్యవంతంగా, సులువుగా నల్గొండ, వరంగల్ చేరుకోవచ్చు.
ఆరాంఘర్ నుండి మీర్ ఆలంట్యాంక్ వరకు జీహెచ్‌ఎంసీ మరో ఫ్లైఓవర్ నిర్మిస్తోంది. ప్రస్తుతం దీని నిర్మాణపనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇది పూర్తయితే కొత్తగా నిర్మించినవాటిలో ఇదే అతిపొడవైన ఫ్లైఓవర్‌గా నిలుస్తుంది. నాగోల్ వద్ద నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులు దాదాపు పూర్తికావచ్చాయి. త్వరలోనే దీనికీ ప్రారంభోత్సవం జరుగనుంది.
ఇవి కాక ఆరంఘర్ నుండి ఎల్బీ నగర్ మీదుగా ఉప్పల్ వరకు మరో 7 ఫ్లైఓవర్లు, అండర్ పాసులు కూడా జీహెచ్‌ఎంసీ నిర్మిస్తోంది. నిర్మాణదశలో ఉన్న ఈ ఫ్లైఓవర్లన్నీ అందుబాటులోకి వస్తే నగర ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరిపోతాయి.