బండి ప్రజా సంగ్రామ యాత్ర... పేరు సార్ధకం!

రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ తన పాదయాత్రకు ఏ ఉద్దేశ్యంతో ప్రజా సంగ్రామ యాత్ర అని పేరు పెట్టుకొన్నారో కానీ ఆ పేరు సార్ధకం అవుతోంది. ఈసారి అడుగడుగునా టిఆర్ఎస్‌-బిజెపి కార్యకర్తల మద్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. 

హైకోర్టు అనుమతితో ఈరోజు పాంనూర్‌ నుంచి బండి సంజయ్‌ మళ్ళీ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించగా అడుగడుగునా టిఆర్ఎస్‌ శ్రేణులు ‘బండి సంజయ్ గో బ్యాక్’ అని నినాదాలు చేస్తూనే ఉన్నారు. దీంతో బిజెపి కార్యకర్తలు టిఆర్ఎస్‌ కార్యకర్తలపై దాడి చేయగా వారు కూడా ప్రతిదాడి చేశారు. పోలీసులు లాఠీ చార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టిన తర్వాత మళ్ళీ బండి సంజయ్‌ పాదయాత్ర మొదలుపెట్టారు. 

ఈరోజు నాగాపురం వరకు బండి సంజయ్‌ పాదయాత్ర కొనసాగుతుంది. రేపు వరంగల్‌ భద్రకాళి అమ్మవారి ఆలయం వరకు పాదయాత్ర చేసి అమ్మవారిని దర్శించుకొంటారు. ఈ మూడవ విడత పాదయాత్ర ముగింపు సందర్భంగా హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో బిజెపి భారీ బహిరంగసభ నిర్వహించాలనుకొంది. కానీ పోలీసులు దానికి అనుమతి నిరాకరించడంతో బిజెపి మళ్ళీ హైకోర్టును ఆశ్రయిస్తూ లంచ్ మోషన్ పిటిషన్‌ వేసింది. కొద్దిసేపటి క్రితం దానిపై విచారణ చేపట్టిన హైకోర్టు బిజేపీ సభకు అనుమతించింది. 

గతంలో ఎన్నడూ లేనివిదంగా బండి సంజయ్‌ పాదయాత్రలో ఇన్నిసార్లు టిఆర్ఎస్‌, బిజెపి కార్యకర్తల మద్య ఘర్షణలు జరగడం, పాదయాత్రకు, బిజెపి సభకు పోలీసులు అనుమతి నిరాకరించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. దీంతో రెండు పార్టీల మద్య జరుగుతున్న రాజకీయ ఆధిపత్య పోరు ముదిరి పాకన్న పడినట్లు అర్దమవుతోంది. ఇక ‘బండి’ కదలడానికి అనుమతించకూడదని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకొన్నట్లే ఉంది. కనుక ఇప్పుడు బిజెపి, కేంద్ర ప్రభుత్వం ఏవిదంగా స్పందిస్తాయో చూడాలి.