కాంగ్రెస్‌కు గులాంనబీ ఆజాద్ రాజీనామా!

మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్‌ నేత గులాంనబీ ఆజాద్ కాంగ్రెస్‌ పార్టీలో పదవులకు, పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి శుక్రవారం రాజీనామా చేశారు. తన రాజీనామాలేఖలో కాంగ్రెస్ పార్టీకి తన అనుబంధాన్ని, కాంగ్రెస్ పార్టీ తనకు పదవులిచ్చి ఆదరించడాన్ని ఆజాద్ ప్రస్తావించి సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలుపుకొన్నారు.

ఆ తర్వాత అసలు విషయం ప్రస్తావిస్తూ, రాహుల్ గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగించి చాలా పెద్ద పొరపాటు చేశారని, ఆయన తా అపరిపక్వతతో పార్టీని సర్వనాశనం చేశారని ఆరోపించారు. తమ వంటి సీనియర్లందరినీ పక్కన పెట్టేసి తనకు నచ్చినవారితో ముఠా ఏర్పాటు చేసుకొని పార్టీ పతనానికి కారణం అయ్యారని ఆరోయించారు. గత 8 ఏళ్ళుగా ఇవన్నీ మీకు (సోనియా గాంధీ)కి తెలియజేస్తున్నప్పటికీ పుత్రవాత్సల్యంతో పట్టించుకోకపోవడంతో కాంగ్రెస్‌ పాతనావస్థకు చేరుకొందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీతో ఇన్నేళ్ళ అనుబందాన్ని తెంచుకొని వెళ్లవలసి వస్తుండటం చాలా బాధ కలిగిస్తున్నప్పటికీ తన మాటకు విలువ లేనప్పుడు పార్టీలో కొనసాగడం అనవసరమని భావించి పార్టీనివీడుతున్నానని రాజీనామా గులాంనబీ ఆజాద్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

ఆయన తన సొంత రాష్ట్రమైన జమ్మూకశ్మీర్‌కు వెళ్ళి అక్కడ సొంత పార్టీ స్థాపించబోతున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ప్రధాని నరేంద్రమోడీ ఆయనకు అనుకూలంగా మాట్లాడుతుండటంతో రాష్ట్రపతి లేదా ఉపరాష్ట్రపతి ఇస్తారనే ప్రచారం జరిగింది. ఆ ఆశతోనే ఆయన కాంగ్రెస్ పార్టీకి మరింత దూరం అయ్యారని కానీ చివరికి రెంటికీ చెడారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.