తెలుగు సినీ పరిశ్రమలో జీవిత రాజశేఖర్ దంపతులు ఎప్పుడూ ఏదో వివాదంలోనే ఉంటారు. అవి సరిపోవన్నట్లు వారు రాజకీయాలలో కూడా ప్రవేశించి పార్టీలు మారుతూ ప్రస్తుతం బిజెపిలో ఉన్నారు. బిజెపిలో ఉన్నామనే ధైర్యమో లేక స్వతహాగా ఆమెకు ఉండే ధైర్యమో తెలీదు కానీ తెలంగాణ సిఎం కేసీఆర్ కుటుంబంపై జీవిత తీవ్ర ఆరోపణలు చేశారు.
ఆమె మీడియాతో మాట్లాడుతూ, “ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నిజంగా కల్వకుంట్ల కవితకు సంబందం లేదంటే నేను ఒక్క మాట అడుగుతాను. కేసీఆర్ తెలంగాణ ఉద్యమాలు మొదలుపెట్టినప్పుడు వారి ఆస్తులు ఎంత?ఇప్పుడు వారి ఆస్తులు ఎన్ని? కేసీఆర్‌గారు నిజంగా ధర్మంగా పరిపాలన చేసి ఉంటే వారికి ఇన్నివేలకోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి?ఏ పబ్బు చూసినా, ఏ క్లబ్బు చూసినా, ఏ షాపింగ్ మాల్ చూసినా కేటీఆర్‌గారికి షేర్ ఉంటుంది. ఇది నేను ఇంత ధైర్యంగా నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే ఆ పబ్బులు, క్లబ్బులు, షాపింగ్ మాల్ యజమానులే నాకు చెప్పారు,” అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.