
మునుగోడు ఉపఎన్నిక కాంగ్రెస్ పార్టీకి ఓ అగ్నిపరీక్ష అనుకొంటే దానికి అభ్యర్ధిని ఎంపికచేయడం మరో పరీక్షగా మారింది. తెలంగాణ ఇంటిపార్టీని హడావుడిగా కాంగ్రెస్‌లో విలీనం చేసుకొని ఆ పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ను పార్టీలో చేర్చుకోవడంతో మునుగోడు టికెట్ ఆయనకు ఇవ్వబోతున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. కానీ తర్వాత చెలమల కృష్ణారెడ్డికి టికెట్ ఇవ్వాలని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మొగ్గు చూపుతున్నట్లు వార్తలు రావడంతో ఆ టికెట్ ఆశిస్తున్న పాల్వాయి స్రవంతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ చెలమలకు టికెట్ ఇస్తే ఎన్నికలలో ఆయాకు సహకరించబోమని తేల్చిచెప్పారు.
అప్పుడు రేవంత్ రెడ్డి తదితర సీనియర్ కాంగ్రెస్ నేతలు ఆమెతో సమావేశమయ్యి మునుగోడు ఉపఎన్నికలలో పోటీ చేయడంపై చర్చించారు. తనకు టికెట్ ఇస్తే సర్వశక్తులు ఒడ్డి పోరాడి టిఆర్ఎస్, బిజెపి అభ్యర్ధులను ఓడించి మునుగోడు చేజారిపోకుండా కాపాడుతానని నమ్మకంగా చెప్పడంతో ఆమె పేరును ఖరారు చేసి కాంగ్రెస్ అధిష్టానంకి తెలియజేశారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రతిపాదించిన అభ్యర్ధికి పార్టీ అధిష్టానం ఆమోదం తెలపడం లాంఛనప్రాయమే కనుక మునుగోడు ఉపఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి పేరు ఖరారు అయినట్లే భావించవచ్చు.