4.jpg)
బిజెపి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఈరోజు పోలీసులు మళ్ళీ నోటీసులు జారీ చేశారు. ముస్లింలపట్ల అనుచితంగా మాట్లాడినందుకు ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌పై జైలుకి పంపగా వెంటనే బెయిల్‌పై విడుదలై నిన్ననే బయటకు వచ్చారు. ఆయనను మళ్ళీ అరెస్ట్ చేసి జైలుకి పంపాలని డిమాండ్ చేస్తూ, హైదరాబాద్ పాతబస్తీలో రెండు రోజులుగా ఆందోళనలు, అల్లర్లు జరుగుతున్నాయి. వారి ఒత్తిడికి తలొగ్గి మంగళ్ హట్, షాహినాయత్ గంజ్ పోలీసులు 41ఏ- సీఆర్పీసీ కింద ఇవాళ్ళ రాజాసింగ్‌కు మళ్ళీ నోటీసులు అందజేశారు.
ఆ రెండూ ఆరు నెలల క్రితం నమోదైన కేసులకు సంబందించినవి కావడం విశేషం. శ్రీరామనవమి సందర్భంగా జరిగిన శోభాయాత్రలో ఎమ్మెల్యే రాజాసింగ్ ఒక వర్గం ప్రజలను రెచ్చగొట్టేలా పాటపాడారని ఫిబ్రవరి 12వ తేదీన షాహినాయత్ గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఓ కేసు నమోదు కాగా, ఫిబ్రవరి 19న మంగళ్ హట్ పోలీస్ స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. ఆ రెండు కేసులకు సంబందించి ఇప్పుడు నోటీసులు జారీ చేయడంపై రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మజ్లీస్ ఒత్తిళ్ళకు కేసీఆర్ తలొగ్గి తనపై పాత కేసులు తిరగదోడి జైలుకి పంపించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.