
బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలతో హైదరాబాద్ పాతబస్తీలో గత మూడురోజులుగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పలు ప్రాంతాలలో ఒక మతానికి చెందిన యువకులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేస్తూ విధ్వంసానికి పాల్పడుతున్నారు. దీంతో పాతబస్తీలో భారీగా పోలీసులను, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బృందాలను మోహరించారు.
అల్లరిమూకలు బుదవారం ఉదయం భవానీనగర్ పోలీస్ స్టేషన్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. శాలిబండలో అల్లరిమూకల రాళ్ళ దాడిలో ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ గాయపడ్డారు. రెండు పోలీస్ వాహనాలు దెబ్బతిన్నాయి. కొంతమంది యువకులు బేగంబజార్ చత్రి వద్ద విధ్వంసం సృష్టించారు. బుదవారం రాత్రి కొంతమంది యువకులు బైక్‌లపై వచ్చి ముస్లింజంగ్ వద్ద ఓ హోటల్ ముందు నిలిపి ఉంచిన వాహనాలను ధ్వంసం చేశారు. సమాచారం అందుకొన్న వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్, ఏసీపీ సతీష్ కుమార్, ఇన్‌స్పెక్టర్ అజయ్ కుమార్ వెంటనే అక్కడకు చేరుకోవడం అల్లరిమూకలు వారిని చూసి పారిపోయాయి. పాతబస్తీలో పలు ప్రాంతాలలో పోలీసులు ప్రజల కదలికలపై ఆంక్షలు విధించారు. నిన్నటి నుంచి మూడు రోజుల వరకు సాయంత్రం 7 గంటలకు అన్ని దుకాణాలు మూసేవేయాలని ఆదేశించారు.
నగరంలో ఛార్మినార్, వనస్థలిపురం, చాంద్రాయణగుట్ట, గోషామహల్, అంబర్ పేట, కేశవగిరి, శాలిబండ, బేగంబజార్, షాయినాత్ గంజ్, అఫ్జల్ గంజ్ తదితర ప్రాంతాలలో పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను మోహరించారు. డీసీపీ సాయిచైతన్య అధ్వర్యంలో బుధవారం పాతబస్తీలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, పోలీసులు కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే చాలా కటినంగా వ్యవహరించాల్సి వస్తుందని డీసీపీ సాయిచైతన్య ఆందోళనకారులను హెచ్చరించారు. ప్రస్తుతం పాతబస్తీలో పరిస్థితులు అదుపులోనే ఉన్నప్పటికీ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎప్పుడేమీ జరుగుతుందోననే భయంతో పలు దుకాణాలు, హోటల్స్, పెట్రోల్ బంకులు స్వచ్ఛందంగా మూసుకొన్నారు.
ముస్లింల మనోభావాలు దెబ్బతీసే విదంగా మాట్లాడినందుకు బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్‌పై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మజ్లీస్ ఎమ్మెల్యే పాషాఖాద్రి శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులకి నిన్న వినతిపత్రం ఇచ్చారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతల పరిస్థితిపై కేంద్ర హోంశాఖ ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకొంటోంది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నిన్న ఢిల్లీ వెళ్ళి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరించారు.