హైదరాబాద్‌ అల్లర్లపై సిఎం కేసీఆర్‌ ఏమన్నారంటే...

ఘోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ అనుచిత వ్యాఖ్యలతో హైదరాబాద్‌ పాతబస్తీలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోపక్క రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి శ్రేణులు నిరసనలు తెలియజేస్తున్నాయి.            

ఈ నేపధ్యంలో సిఎం కేసీఆర్‌ బుదవారం ప్రగతి భవన్‌లో హోంమంత్రి మహమూద్ ఆలీ, డిజిపి మహేందర్ రెడ్డి, శాంతిభద్రతల అదనపు డీజీ జితేందర్, హైదరాబాద్‌, రాచకొండ, సైబరాబాద్ కమీషనర్లు సీవీ ఆనంద్, మహేశ్ భగవత్, స్టీఫెన్ రవీంద్రలతో సమావేశమయ్యి రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించారు. 

రాష్ట్రంలో హటాత్తుగా మొదలైన ఈ అల్లర్ల వెనుక ఓ రాజకీయశక్తి, రాజకీయకోణం ఉందని సిఎం కేసీఆర్‌ అన్నారు. తెలంగాణలో శాంతిభద్రతలకు భంగం కలిగించాలని ప్రయత్నించేవారిని ఉపేక్షించవద్దని, కటినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హైదరాబాద్‌లో అల్లర్లు ఇతర ప్రాంతాలకు, ఇతర జిల్లాలకు వ్యాపించకుండా ఎక్కడిక్కడ పోలీసులను, అవసరమైతే అదనపు బలగాలను మోహరించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పుడు కమాండ్ కంట్రోల్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది కనుక దాని ద్వారా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులను నిశితంగా గమనిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అరాచకశక్తులు సోషల్ మీడియాను కూడా వాడుకొంటూ అల్లర్లు సృష్టించాలని ప్రయత్నిస్తున్నాయి కనుక దానిపై కూడా ఓ కన్నేసి ఉంచాలని సిఎం కేసీఆర్‌ పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు.