కల్వకుంట్ల కవిత కేసుపై కోర్టు మద్యంతర ఆదేశాలు

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తెలంగాణ సిఎం కేసీఆర్‌ కుమార్తె, టిఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ప్రమేయం ఉందంటూ బిజెపి ఎంపీ పర్వేష్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సిర్సాలు చేసిన ఆరోపణలను ఆమె వెంటనే ఖండించారు. దాంతో తనకు ఎటువంటి సంబందమూ లేదని, తన తండ్రి కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కొలేకనే బిజెపి ఇటువంటి నీచమైన ప్రయత్నాలు చేస్తోందని కల్వకుంట్ల కవిత ఆరోపించారు. 

తన ప్రతిష్టకు భంగం కలిగించేవిదంగా ఆరోపణలు చేసినందుకు వారిరువురిపై కల్వకుంట్ల కవిత పరువునష్టం దావా కూడా వేశారు. హైదరాబాద్‌ సిటీ సివిల్ 9వ కోర్టులో మంగళవారం ఆమె ఇంజంక్షన్ పిటిషన్‌ దాఖలు చేశారు. దానిలో తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేవిదంగా ఆ ఇద్దరు బీజేపీ నేతలు మాట్లాడకుండా ఆదేశించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. 

ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు విచారణ చేపట్టిన న్యాయస్థానం బిజెపి ఎంపీ పర్వేష్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సిర్సాలకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. బలమైన సాక్ష్యాధారాలు లేకుండా కల్వకుంట్ల కవితపై ఎటువంటి వ్యాఖ్యలు చేసినా కోర్టుధిక్కారంగా పరిగణించి చర్యలు తీసుకోవలసి వస్తుందని హెచ్చరిస్తూ న్యాయస్థానం మద్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్‌ 13కు వాయిదా వేసింది. 

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఢిల్లీలో బీజేపీ నేతలు ఏమి మాట్లాడుతున్నారో తెలియదు కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆమెపై, సిఎం కేసీఆర్‌పై చాలా తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. కనుక కనుక ఢిల్లీలో బీజేపీ నేతలు మాట్లాడిన మాటల కంటే ఇక్కడ తెలంగాణలో ప్రతిపక్ష నేతలు చేస్తున్న విమర్శలతోనే ఆమె ప్రతిష్టకు, దాంతోబాటు సిఎం కేసీఆర్, తెరాస ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలుగుతోంది. కనుక ముందుగా రాష్ట్రంలో ఈ వ్యవహారంపై వినిపిస్తున్న విమర్శలు, ఆరోపణలకు ఆమె చెక్ పెట్టవలసి ఉంటుంది. కానీ అది సాధ్యమా?