బిజెపి అధికారంలోకి వస్తే ఇదే జరుగుతుంది

ఎనిమిదేళ్ళుగా ఎంతో ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌ నగరంలో నిన్న, ఇవాళ్ళ అల్లర్లు జరుగడంపై పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ చాలా సునిశితంగా విశ్లేషించారు. “తెలంగాణ రాష్ట్రం ప్రశాంతంగా ఉంటూ అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుంటే, బిజెపి నేతలు రాష్ట్రంలో మతవిద్వేషాలు రగిలించి అల్లర్లు జరిగేలా చేస్తుండటం చాలా బాధాకరం. ఈ పరిణామాలు చూస్తే ఒకవేళ ప్రజలు బిజెపికి అధికారం కట్టబెడితే తెలంగాణ రాష్ట్రం ఏవిదంగా మారుతుందో అర్దం చేసుకోవచ్చు. 

ఇక్కడ రాష్ట్రంలో బిజెపి ఈవిదంగా వ్యవహరిస్తుంటే అక్కడ కేంద్రంలో మోడీ ప్రభుత్వం తన లోపాలను, వైఫల్యాలను, నానాటికీ పెరుగుతున్న ధరలను కప్పి పుచ్చుకొనేందుకు దేశ ప్రజల మద్య చిచ్చుపెడుతోంది. బిజెపి, మోడీ ప్రభుత్వం చేస్తున్న ఈ కుట్రలను ప్రజలు అర్దం చేసుకొని అడ్డుకోకపోతే దేశానికి, భావి తరాలకు కూడా తీరని నష్టం జరుగుతుంది. 

దేశం కోసం ధర్మం కోసం వంటి అందమైన నినాదాలు ప్రజలను మభ్యపెట్టేందుకే. కానీ ఆచరణలో బిజెపి అందుకు పూర్తి విరుద్దంగా దేశ ప్రజల మద్య చిచ్చు పెడుతుంటుంది. హర్ ఘర్ జల్ (ప్రతీ ఇంటికి త్రాగునీరు) అంటుంది కానీ ఆచరణలో హర్ దిల్‌ మే జహర్ (ప్రతీ మనిషిలో విద్వేషాలు) అమలుచేస్తుంటుంది. 

ఓ వైపు రోజురోజుకీ అన్నిటి ధరలు పెరిగిపోతుంటే మరోవైపు లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ ప్రభుత్వం అయినకాడికి అమ్మేస్తూ దేశంలో నిరుద్యోగం మరింత పెంచుతోంది. దేశ ప్రజలకు మతాల చిచ్చు, విద్వేషాలు కాదు... అందరికీ ఉద్యోగాలు, పరస్పర గౌరవం ముఖ్యమని మోడీ ప్రభుత్వం గ్రహించడం లేదు. మోడీ ప్రభుత్వం, బిజెపిల తీరుతో దేశం ప్రమాదకరమైన పరిస్థితిలో ఉందిప్పుడు. కనుక తెలంగాణతో సహా యావత్ దేశ ప్రజలు బిజెపిని దూరంగా పెట్టాల్సిన అవసరం ఉంది,” అని అన్నారు.