పిల్లలను మభ్యపెట్టినట్లే ప్రజలను మభ్యపెట్టాలని కేసీఆర్‌ ప్రయత్నం

రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ సిఎం కేసీఆర్‌పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఈరోజు కరీంనగర్‌లో నిరసన దీక్ష సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, “చిన్నప్పుడు పసిపిల్లలు కిందపడి ఏడుస్తున్నప్పుడు వారిని సముదాయించేందుకు మనం నేలని చేతితో కొట్టి ఆకాశం వైపు చూపుతూ ఏవో కబుర్లు చెపుతూ వారిని డైవర్ట్ చేసేందుకు ప్రయత్నిస్తుంటాము. అదేవిదంగా, ఇప్పుడు సిఎం కేసీఆర్‌ తన కుమార్తె కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో చిక్కుకోవడంతో ఆమెను కాపాడేందుకు, ప్రజల దృష్టిని మళ్ళించేందుకు నావంటి బిజెపి నేతలని అరెస్ట్ చేయించడం, నా ప్రజాసంగ్రామ యాత్రను అడ్డుకోవడం వంటి చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారు. 

అయినప్పటికీ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తన కుమార్తె పేరు మారుమ్రోగిపోతుండటంతో మజ్లీస్‌ పార్టీని ప్రోత్సహించి హైదరాబాద్‌లో అల్లర్లు జరిపించేందుకు కూడా కేసీఆర్‌ వెనకాడటం లేదు. కేసీఆర్‌ ఇంత నీచానికి దిగజారిపోతారని మేము ఊహించలేదు. 

రాష్ట్రంలో పబ్బులు, మాదకద్రవ్యాలు, మద్యం, ఇసుక మాఫియా అన్నిటిలో టిఆర్ఎస్‌ నేతలే ఉన్నారు. దేశంలో ఎక్కడ ఈడీ, ఐ‌టి దాడులు జరిగినా వాటిలో టిఆర్ఎస్‌ నేతల పేర్లు బయటపడుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత పేరు బయటపడటమే ఇందుకు తాజా ఉదాహరణ. 1,400 మంది యువకుల బలి దానాలతో తెలంగాణ సాధించుకొన్నది ఇందుకా? 

ఇంతకు ముందు నేను ప్రజాసంగ్రామ యాత్ర చేసినప్పుడు లేని సమస్యలు ఇప్పుడే ఎందుకు పుట్టుకువచ్చాయంటే, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో చిక్కుకోవడంతో తన కుమార్తె చిక్కుకోవడం వలననే. కానీ కేసీఆర్‌ ఎన్ని అవరోధాలు సృష్టించినప్పటికీ నేను ప్రజాసంగ్రామ యాత్ర చేసి తీరుతాను. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్‌ కుటుంబ పాలనలో జరుగుతున్నా అవినీతి, అక్రమాల గురించి ప్రజలకు వివరిస్తాను,” అని బండి సంజయ్‌ అన్నారు.