బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ముస్లింలను ఉద్దేశ్యించి అనుచితంగా మాట్లాడినందుకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి కోర్టు ఆదేశం మేరకు నిన్న జైలుకి తరలించగా, వెంటనే ఆయన బెయిల్‌పై విడుదలై బయటకు వచ్చేయడంతో నగరంలో ముస్లింలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఈరోజు ఉదయం పాతబస్తీలో పలువురు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేశారు. శాలిబండ చౌరస్తాలో కొందరు ఎమ్మెల్యే రాజాసింగ్ దిష్టిబొమ్మను దగ్దం చేయగా, మొఘల్‌పురాలో కొందరు పోలీస్ వాహనాన్ని ధ్వంసం చేశారు. బేగంబజార్ చత్రి వంతెన వద్దకు భారీ సంఖ్యలో యువకులు తరలివచ్చి ఎమ్మెల్యే రాజాసింగ్‌ను తక్షణం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు వారిపై స్వల్పంగా లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టారు. ముందుజాగ్రత్త చర్యగా పాతబస్తీ నుంచి ఘోషమహల్ వైపు వెళ్ళే అన్ని మార్గాలను పోలీసులు మూసివేసి, రాజాసింగ్ ఇంటి భారీగా పోలీసులను మోహరించారు. ప్రస్తుతం పాతబస్తీ ప్రశాంతంగా కనిపిస్తున్నప్పటికీ, ఏ క్షణంలో ఏమి జరుగుతుందో అని అందరూ ఆందోళనగానే ఉన్నారు.