గవర్నర్‌ తమిళిసై నేడు ఢిల్లీకి.. తర్వాత ఏమిటి?

తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్‌-బిజెపిల మద్య జరుగుతున్న రాజకీయ ఆధిపత్యపోరుకి మునుగోడు ఉపఎన్నికలు వేదికగా మారుతాయనుకొంటే, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో టిఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ప్రమేయం ఉందని బిజెపి ఆరోపించడంతో ఉపఎన్నికల కంటే ముందే రాష్ట్రంలో యుద్ధవాతావరణం ఏర్పడింది. 

కవిత ఇంటి ముందు బిజెపి శ్రేణులు ధర్నా చేసినందుకు పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి ఆయన పాదయాత్రకు అనుమతి నిరాకరించారు. పాదయాత్రకు అనుమతి కోరుతూ బండి సంజయ్‌ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ వేశారు. ఈనెల 27న భారీ బహిరంగసభ కూడా జరుపుతామని చెపుతున్నారు. టిఆర్ఎస్‌ ప్రభుత్వం, పోలీసుల తీరును నిరసిస్తూ బిజెపి కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. 

మరోపక్క టిఆర్ఎస్‌ శ్రేణులు బిజెపి ఫ్లెక్సీ బ్యానర్‌లను చించేయగా, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర బిజెపి నేతలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. 

ఓ వైపు టిఆర్ఎస్‌-బిజెపిల మద్య ఈ పోరు కొనసాగుతుంటే, మరోపక్క బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ముస్లింలను ఉద్దేశ్యించి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో హైదరాబాద్‌ పాతబస్తీలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలంగాణ రాష్ట్రంలో, రాజధాని హైదరాబాద్‌ నగరంలో గత 8 ఏళ్ళలో ఎన్నడూ ఇంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడలేదు. 

రాష్ట్రంలో పరిస్థితులపై ఆరా తీసేందుకు కేంద్ర ప్రభుత్వం గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను ఢిల్లీకి రమ్మనమని ఆదేశించడంతో ఆమె ఈరోజు బయలుదేరుతున్నారు. ఆమె పట్ల కూడా సిఎం కేసీఆర్‌, తెలంగాణ ప్రభుత్వం అనుచితంగా వ్యవహరిస్తున్నందున, ఆమె నివేదిక ఏవిదంగా ఉండబోతుందో ఊహించవచ్చు. 

ఆమె ఓ బిజెపి నేతలాగ వ్యవహరిస్తున్నారని టిఆర్ఎస్‌ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఆమె రాష్ట్ర రాజకీయాలలో జోక్యం చేసుకోలేదు కానీ ఇకపై ఆమె ‘గవర్నర్‌ పాత్ర’ పోషించడం ఖాయం. అది ఏవిదంగా ఉండబోతోందో త్వరలో టిఆర్ఎస్‌తో సహ అందరూ చూడగలుగుతారు.