10.jpg)
మొన్న ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా మహంకాళీ అమ్మవారిని దర్శించుకొని గుడి బయటకు వచ్చినప్పుడు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పరుగున వెళ్ళి ఆయనకు చెప్పులు అందించారు. దీనిపై మంత్రి కేటీఆర్‌తో సహా టిఆర్ఎస్ నేతలు “గుజరాత్ బిజెపి నాయకుల కాళ్ళవద్ద తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని పెట్టారు. బండి సంజయ్ బానిసనని నిరూపించుకొన్నాడు. రేపు బిజెపికి అధికారం ఇస్తే తెలంగాణ రాష్ట్రాన్ని అమిత్ షా కాళ్ళవద్ద పెడతాడు,” అంటూ ట్వీట్స్ చేశారు.
వీటిపై బండి సంజయ్ అంతకంటే ఘాటుగా బదులిచ్చారు. ఢిల్లీ లిక్కర్ మాఫియాలో పడి కొట్టుకొంటున్న కుటుంబ సభ్యులు రహస్యాలు బయటపడకుండా తంటాలుపడుతూ చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. అధికారం కోసం లోపల ఇంట్లో రోజూ తన్నుకొంటున్న మీ కుటుంబసభ్యులకు, పెద్దలకు చెప్పులు అందించడంలో సంస్కారం ఏం అర్దం అవుతది? రామభరతుల వారసత్వాన్ని మేం తలకెత్తుకున్నాం... తండ్రిని బందించి, అన్నను చంపి అధికారం పొందిన ఔరంగజేబు వారసుల పక్కన తిరిగే మీకు మా సంస్కృతి ఏం అర్దం అవుతుంది? మేం పాదరక్షలు మాత్రమే గౌరవంతో అందిస్తాం...! మీలా అవసరం తీరాక పాదాలు పట్టి లాగేసే అలవాటు మాకు లేదు. మీలా మజ్లీస్‌కు సలాం కొట్టే రజాకార్ల వారసులమ్ అసలే కాదు. భారత్ మాతాకీ జై!” అని ట్వీట్ చేశారు.
బండి సంజయ్ ఇంతటితో ఆగలేదు. సిఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలలో ప్రవేశం వంకతో చేస్తున్న రాష్ట్రాల పర్యటనలు లిక్కర్ కంపెనీలను ఏకం చేసేందుకే. ఢిల్లీలో పది రోజులు బస చేసింది కూడా దీనికే. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలలో లిక్కర్ దందాను విస్తరించుకోవడానికి కేసీఆర్, కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారంటూ బండి సంజయ్ చాలా తీవ్ర ఆరోపణలు చేశారు. తాను అమిత్ షా చెప్పులు మోయడం గురించి ట్వీట్లు చేసిన కేటీఆర్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి తన సోదరి కవిత, తన కుటుంబంపై ఆరోపణలు వస్తుంటే ఎందుకు స్పందించి ట్వీట్ చేయడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు.