ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో నాకు సంబందమూ లేదు

తెలంగాణ సిఎం కేసీఆర్‌ కుమార్తె, టిఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణకు చెందిన మద్యం వ్యాపారులతో కలిసి ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాతో కలిసి ఢిల్లీలో మద్యం విధానం అమలుచేసేందుకు తెరచాటు ప్రయత్నాలు చేశారని ఢిల్లీలో బిజెపి ఎంపీ పర్వేష్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సిర్సాలు ఆరోపించడం తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 

తెలంగాణకు చెందిన ఓ బడా మద్యం వ్యాపారి కల్వకుంట్ల కవిత మరికొందరికి ప్రత్యేక విమానం, ఢిల్లీలో ఓ స్టార్ హోటల్‌లో సూట్ సమకూర్చారని వారు ఆరోపించారు. ఈ వ్యవహారంలో వందల కోట్లు కమీషన్ల రూపంలో చేతులు మారాయని వారు ఆరోపించారు. 

ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఎమ్మెల్సీ కవిత వెంటనే మీడియా ముందుకు వచ్చి ఖండించారు. హైదరాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ, “ఈ వ్యవహారం గురించి మీడియాలో వార్తలు వస్తున్నాయని మా పార్టీ నేతలు చెపితేనే నాకు దీని గురించి తెలిసింది. ఢిల్లీ బిజెపి నేతలు చెపుతున్న ఆ మద్యం కుంభకోణంతో నాకు ఎటువంటి సంబందామూ లేదు. అసలు దాని గురించి నాకు తెలియదు కూడా. 

బిజెపి ఇటువంటి నీచ రాజకీయాలు ఎందుకు చేస్తోందంటే మా నాన్నగారు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌గారు మోడీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసి విమర్శిస్తుండటంతో బిజెపి ఈ కుట్రకు తెరతీసిందని భావిస్తున్నాను. ఈవిదంగానైనా మా నాన్నగారు వెనక్కు తగ్గుతారేమోనని బిజెపి భావిస్తున్నట్లుంది. కానీ మాది పోరాటాలు చేసిన కుటుంబం. ఇటువంటి అసత్య ప్రచారాలకు భయపడేది లేదు. తగ్గేదిలేదు. రాజకీయాలలో ఈవిదంగా బట్ట కాల్చిమీదేయాలనే బిజెపి ఆలోచన ధోరణి సరికాదు. దీంతో మాకేమీ కాదు కానీ మావంటి పోరాట యోధులతో పెట్టుకొన్నందుకు బిజెపియే మూల్యం చెల్లించాల్సి వస్తుంది. నాపై అసత్య ఆరోపణలు చేసిన బిజెపి నేతలపై పరువు నష్టం దావా వేస్తాను,” అని హెచ్చరించారు. 

ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఈరోజు సంచలన ప్రకటన చేశారు. “నేను ఆమాద్మీ పార్టీని చీల్చి బిజెపిలో చేరితే ఈ స్కామ్ కేసు ఎత్తివేసి ఢిల్లీ ముఖ్యమంత్రిని చేస్తామని బిజెపి నేతలు ఆఫర్ ఇచ్చారు. వారి మాటలన్నీ నా మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసి ఉంచాను. సరైన సమయంలో దానిని బయటపెడతాను,” అని అన్నారు. 


వీడియో ఈనాడు సౌజన్యంతో..