.jpg)
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆహ్వానం మేరకు జూ.ఎన్టీఆర్ ఆదివారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయం వద్ద నోవాటెల్ హోటల్‌కు వెళ్ళి ఆయనను కలిశారు. జూ.ఎన్టీఆర్ హోటల్ చేరుకొన్నప్పుడు కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్ తదితర బిజెపి అగ్రనేతలు ఎదురేగి సాదరంగా స్వాగతం పలికి అమిత్ షా వద్దకు తోడ్కొనివెళ్ళారు. వారు కూడా అమిత్ షా-జూ.ఎన్టీఆర్ భేటీలో పాల్గొన్నారు.
కేవలం 15 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో ఆర్ఆర్ఆర్ సినిమాలో జూ.ఎన్టీఆర్ నటనను ప్రశంశించారు. ఈ సందర్భంగా స్వర్గీయ ఎన్టీఆర్‌ను కూడా ఆయన గుర్తుచేసుకొన్నట్లు తెలుస్తోంది. వారి మద్య ఎటువంటి రాజకీయ చర్చలు జరగలేదని బిజెపి నేతలు తెలిపారు.
అనంతరం కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు జూ.ఎన్టీఆర్‌కు తమ ఆహ్వానం మన్నించి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకొని బయట కారు వరకు వచ్చి సాదరంగా వీడ్కోలు పలికారు. అయితే జూ.ఎన్టీఆర్‌ను కేవలం అభినందించడానికే కేంద్ర హోం మంత్రి అమిత్ షా పిలిచారంటే నమ్మశక్యంగా లేదు. కనుక వారి భేటీతో ఏ రాజకీయ పరిణామాలు జరుగనున్నాయో చూడాలి.