మునావర్ ఫారూఖీ... స్టాండప్ కామెడీ షో ఆర్టిస్ట్. అతను చేస్తున్న కామెడీషో కంటే తన షోలో హిందూ దేవుళ్ళని కించపరుస్తూ చేసిన కామెడీ వల్లనే దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని చెప్పవచ్చు. అతని షోలు హిందువుల మనోభావాలు దెబ్బతినేవిదంగా ఉంటున్నందున కర్ణాటక ప్రభుత్వం నిషేధం విదించింది. దేశవ్యాప్తంగా హిందూ సంస్థలు, బిజెపి నేతలు అతని షోలను అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తుంటారు.
ఇవాళ్ళ హైదరాబాద్ శిల్పకళావేదికలో మునావర్ ఫారూఖీ షో ఉంది. దీనికి బుక్ మై షో ద్వారా అన్ని టికెట్స్ అమ్ముడుపోయాయి. ఈ షోకి పోలీసులు అనుమతివ్వడంపై బిజెపి ఘోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర అభ్యంతరం చెపుతున్నారు. మునావర్ షోను రద్దు చేయాలని లేకుంటే తాము అడ్డుకొని వేదికని తగలబెట్టేస్తామని హెచ్చరించారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి లాలాగూడా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆయన అనుచరులను మరికొందరిని గృహనిర్బందంలో ఉంచారు.
శిల్పకళావేదిక వద్ద బారీగా పోలీసులను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే ఈ షోను ఎట్టి పరిస్థితులలో అడ్డుకోవాలని నిశ్చయించుకొన్న కొందరు బిజెపి వైఎం నాయకులు కూడా ముందే టికెట్స్ కొనుకొన్నారు. కనుక వారులోపలకి ప్రవేశించి షోను అడ్డుకోబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ షోకి అన్ని అనుమతులు ఉన్నాయని కనుక ఎవరైనా అడ్డుకోవాలని ప్రయత్నిస్తే వారిపై చట్ట ప్రకారం కటించర్యలు తీసుకొంటామని మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి హెచ్చరించారు. కానీ ఎట్టి పరిస్థితులలో మునావర్ షోని అడ్డుకొంటామని బిజెపి నేతలు హెచ్చరిస్తున్నారు. కనుక ఈ రోజు షో సజావుగా జరుగుతుందో లేదో తెలీని పరిస్థితి నెలకొంది.