ఉపఎన్నికలతో మునుగోడులో ఉద్రిక్త పరిస్థితులు

మునుగోడు ఉపఎన్నికల గంట మ్రోగకమునుపే రాష్ట్రంలో మూడు ప్రధానపార్టీలు అప్పుడే ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తుండటం గమనిస్తే ఈసారి ఈ ఉపఎన్నికలలో ఎంత భీభత్సం జరుగబోతోందో ఊహించుకోవచ్చు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన వెంటనే కాంగ్రెస్ పార్టీ చండూరులో బహిరంగసభ నిర్వహించగా, ఇవాళ్ళ టిఆర్ఎస్‌ ప్రజా దీవెన పేరుతో మునుగోడులో బహిరంగసభ నిర్వహించబోతోంది. సిఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ నుంచి 4,000 కార్లతో ర్యాలీగా బయలుదేరి మధ్యాహ్నం రెండు గంటలకు మునుగోడు చేరుకొనున్నారు. కనుక ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు హైదరాబాద్‌-చౌటుప్పల్ మార్గంలో వాహనాలను వేరే మార్గాలకు మళ్ళించబోతున్నారు. 

రేపు మునుగోడులోనే బిజెపి కూడా భారీ బహిరంగసభ నిర్వహించబోతోంది. ఈ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా హాజరుకాబోతున్నారు. ఆయన సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన అనుచరులతో కలిసి బిజెపిలో చేరబోతున్నారు. కనుక ఈ సభను విజయవంతం చేసేందుకు భారీగా జనసమీకరణ చేస్తున్నారు. 

ఈ ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌ను మరోసారి ఓడగొట్టి తన సత్తా చాటుకోవాలనుకొంటున్న ఈటల రాజేందర్‌, రఘునందన్ రావు తదితర బిజెపి నేతలు కూడా మునుగోడులో తిష్టవేసి బహిరంగసభను విజయవంతం చేసేందుకు గట్టిగా కృషి చేస్తున్నారు. 

ఒక్క రోజు వ్యవధిలో ఒకే చోట టిఆర్ఎస్‌, బిజెపిలు పోటాపోటీగా బహిరంగసభలకు జనసమీకరణకు ప్రయత్నిస్తుండటంతో మునుగోడులో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉపఎన్నికల నాటికి మరింత ఉద్రిక్తతలు పరస్పరం దాడులు చేసుకొనే స్థాయికి వెళ్ళినా ఆశ్చర్యం లేదు. మునుగోడు ప్రజలు ఇటువంటి ప్రమాదకర వాతావరణంలో ఉన్నారు కనుక అందరూ అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం.