బిజెపిలోకి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి?

మాజీ ఎంపీ, టిఆర్ఎస్‌ సీనియర్ నాయకుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిజెపిలో చేరేందుకు సిద్దంగా ఉన్నారా? అంటే అవుననే అంటున్నారు హుజురాబాద్‌ బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చాలాకాలంగా టిఆర్ఎస్‌ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయినా పార్టీ అధిష్టానం పట్టించుకోలేదు. ఆయన నిన్న ఖమ్మంలో తన కుమార్తె పెళ్లి రిసెప్షన్ చాలా ఘనంగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్‌ నేతలు ఒక్కరూ కూడా కనబడకపోగా ఈటల రాజేందర్‌ ఆయన పక్కన ప్రత్యక్షమయ్యారు. ఈటల రాజేందర్‌కు ఇతర పార్టీల నేతలను బిజెపిలోకి ఆకర్షించే బాధ్యత అప్పగించబడిన సంగతి తెలిసిందే. కనుక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిజెపిలో చేరడం ఖాయంగానే కనిపిస్తోంది. ఈ నెల 21న మునుగోడు బిజెపి బహిరంగసభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సమక్షంలో ఆయన, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలతో సహా మరికొందరు కాంగ్రెస్‌, టిఆర్ఎస్‌ నేతలు కాషాయ కండువాలు కప్పుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఊహాగానాలను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖండించలేదు.