నన్ను ఎందుకు పక్కన పెట్టారో పార్టీనే అడగండి

ఈరోజు సర్వాయి పాపన్న జయంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన బిజెపి ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతి, రాష్ట్ర బిజెపి అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘మీరు పార్టీలో ఎందుకు సైలెంట్‌గా ఉండిపోతున్నారు?’ అని విలేఖరులు అడిగిన ప్రశ్నకు విజయశాంతి నవ్వుతూనే సమాధానం చెప్పారు కానీ ఆమె మాటలలో రాష్ట్ర బిజెపి అధిష్టానంపై అసంతృప్తి స్పష్టంగా కనబడింది. 

“కరోనా కారణంగా కొంతకాలం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండిపోవలసి వచ్చిన మాట వాస్తవమే. కానీ నేను కోలుకొన్నాక కూడా పార్టీ నాకు ఎటువంటి బాధ్యతలు అప్పగించకపోవడంతో నేను సైలంట్ మోడ్‌లో ఉండిపోవలసి వచ్చింది. కనుక నన్ను ఎందుకు పక్కన పెట్టారో, నేను ఎందుకు సైలంట్ మోడ్‌లో ఉండవలసి వచ్చిందో మీడియా మిత్రులు మీరే మా పార్టీ అధిష్టానాన్ని అడిగి తెలుసుకొని నాకు చెప్పండి. 

అసలు పార్టీ నాకు ఏదైనా బాధ్యత అప్పగిస్తే కదా చేస్తాను? కానీ ఏ పని ఇవ్వకపోతే నేను మాత్రం ఏమి చేయగలను?ఈరోజు కార్యక్రమంలో నేను మాట్లాడుదామనే అనుకొన్నాను కానీ లక్ష్మణ్ గారు వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోయారు. ఇక నేనేం మాట్లాడగలను? అందుకే ఏమీ మాట్లాడకుండానే తిరిగి వెళ్ళిపోతున్నాను. నేను ఎప్పుడు రాములమ్మనే. రాములమ్మ పాత్రలోనే ఉంటాను. కానీ పార్టీలో నాకు ఏ పాత్ర లేకుండా చేయాలనుకొంటున్నవారినే గొయ్యి తీసి పాతర వెయ్యాలి. మునుగోడు ఉపఎన్నికలలో బిజెపి తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను,” అని అన్నారు.