ఇక నుంచి సంక్షేమ పధకాలకు ఆధార్ తప్పనిసరి

ఇక నుంచి దేశవ్యాప్తంగా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న ఏ సంక్షేమ పధకాలు పొందాలన్నా తప్పనిసరిగా ఆధార్ కార్డు కలిగి ఉండాలని యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆధారిటీ ఆఫ్ ఇండియా (యుఐడీఏఐ)ప్రకటించింది. ఈ మేరకు ఆగస్ట్ 11వ తేదీన అన్ని కేంద్ర ప్రభుత్వం మంత్రిత్వ శాఖలకు ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలో 99 శాతం మంది వయోజనులకు ఆధార్ కార్డులు పొందారు కనుక సంక్షేమ పధకాలు పొందేందుకు ఆధార్ తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించింది. ఒకవేళ ఇప్పటికీ ఎవరైనా ఆధార్ కార్డ్ లేనట్లయితే దాని కోసం దరఖాస్తు చేసుకొని ఆ రసీదును చూపించి సంక్షేమ పధకాలు పొందవచ్చని తెలిపింది.

నిజానికి ఈ పని ఎప్పుడో చేయవలసి ఉంది కానీ గ్రామీణ ప్రాంతాలు, ఏజన్సీ ఏరియాలలో ప్రజలకు ఆధార్ కార్డులు పొందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనుక ఈ నిర్ణయం వాయిదా వేస్తోంది. సంక్షేమ పధకాలను ఆధార్ కార్డులతో అనుసంధానం చేసినట్లయితే, దేశవ్యాప్తంగా లక్షలాది మంది అనర్హులను గుర్తించి వారికి సంక్షేమ పధకాలను నిలిపివేయవచ్చు. తద్వారా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలపై సంక్షేమ భారం కొంతైనా తగ్గుతుంది.