తెలంగాణ సిఎం కేసీఆర్ ఈరోజు వికారాబాద్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న తర్వాత బహిరంగసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం ఎన్నికల ప్రసంగాన్ని తలపించింది. తెలంగాణ ఏర్పడక మునుపు పరిస్థితులు ఏవిదంగా ఉండేవి, ఇప్పుడు ఏవిదంగా ఉన్నాయో ఎవరికి వారు బేరీజు వేసుకొని చూసుకోవాలని అన్నారు. దశాబ్ధాలుగా తెలంగాణను పట్టి పీడిస్తున్న నీళ్ళు, విద్యుత్ కొరతలను శాస్వితంగా నివారించామని, అన్ని రంగాలలో రాష్ట్రాన్ని అభివృద్ధిపదంలో నడిపిస్తున్నామని చెప్పారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు దేశంలో, ప్రపంచంలో మరెక్కడా లేనన్ని సంక్షేమ పధకాలను కూడా విజయవంతంగా అమలుచేస్తున్నామని చెప్పారు. కానీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఏమాత్రం సహకరించకపోగా అడుగడుగునా అడ్డుపడుతోందని సిఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశ ప్రధానే తెలంగాణ రాష్ట్రానికి శత్రువుకావడం చాలా దౌర్భాగ్యమని అన్నారు. తాను చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించి అభివృద్ధి చేశానని, దానిని బిజెపి గుంటనక్కలు ఎత్తుకుపోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నాయని అన్నారు. కనుక ఈ బహిరంగసభ ముగిసిన తర్వాత ప్రజలు తమ ఊర్లకు వెళ్ళి పెద్దలందరూ కూర్చొని మనకు తెలంగాణను అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ కావాలా, రాష్ట్రంలో అశాంతి సృష్టించాలని ప్రయత్నిస్తున్న బిజెపి కావాలా? అని బాగా ఆలోచించుకోవాలని హితవు పలికారు.
ఏ రాష్ట్రంలో ప్రజలలో రాజకీయ చైతన్యం లోపిస్తుందో ఆ రాష్ట్రంలో ఎన్నటికీ బాగుపడదని అన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని బాగుచేసుకొన్నట్లే రేపు దేశాన్ని కూడా బాగుచేసుకొనే బాధ్యత మన అందరిపై ఉందని అన్నారు. కేంద్రంలో బిజెపిని తరిమికొట్టి ఫెడరల్ స్పూర్తి గల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడంలో తెలంగాణ ప్రజలందరూ భాగస్వాములు కావాలని సిఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.