ఖమ్మం జిల్లా తెల్దారుపల్లిలో ఈరోజు ఉదయం తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్యకు గురయ్యారు. ఆయన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు వరుసకు సోదరుడు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావుకు ప్రధాన అనుచరుడు. ఈరోజు ఉదయం ఆయన తన బైక్పై వెళుతుండగా గ్రామ శివార్లలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆటోతో బైక్ను ఢీకొట్టించగా కృష్ణయ్య క్రింద పడిపోయారు. అప్పుడు వారు కృష్ణయ్యపై కత్తులు, గొడ్డళ్ళతో అతి దారుణంగా దాడి చేసి హత్యచేసి పారిపోయారు.
తమ్మినేని కృష్ణయ్య మొదట సీపీఎంలోనే ఉండేవారు. కానీ ఆ తర్వాత పార్టీతో విభేదించి టిఆర్ఎస్లో చేరారు. క్రమంగా తుమ్మల నాగేశ్వర రావుకి ప్రధాన అనుచరుడిగా మారారు. అప్పటి నుంచి ఆయనకు, ఆయన సోదరుడు వరుస అయిన తమ్మినేని కోటేశ్వర రావుకు మద్య రాజకీయ ఆధిపత్యపోరు కొనసాగుతోంది.
ఇటీవలే కృష్ణయ్య వర్గం తెల్దారుపల్లిలో తమ్మినేని కోటేశ్వరరావు ఇంటిపై దాడి చేసి ఇంట్లో ఫర్నీచర్ ధ్వంసం చేసి భీభత్సం సృష్టించారు. బహుశః అందుకు ప్రతిగా వారు ఈవిదంగా ప్రతీకారం తీర్చుకొని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
తమ్మినేని కృష్ణయ్య హత్యతో ప్రస్తుతం తెల్దారుపల్లిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితులు అదుపుతప్పకుండా ముందు జాగ్రత్తగా గ్రామంలో భారీగా పోలీసులను మోహరించారు. పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.