దేశ నిర్మాణంలో తెలంగాణ కీలకపాత్ర: కేసీఆర్‌

76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ సిఎం కేసీఆర్‌ ఇవాళ్ళ గోల్కొండ కోటపై మువ్వన్నెల జెండా ఎగురవేసారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, “అనేక మంది మహనీయుల త్యాగాల వలన మనకు స్వాతంత్ర్యం లభించింది. వారి త్యాగ ఫలాలను అనుభవిస్తున్న మనం ఈ సందర్భంగా వారందరినీ మరోసారి స్మరించుకొంటున్నాము. 

రాష్ట్రంలో ప్రతీ ఒక్కరిలో జాతీయస్పూర్తిని నింపాలనే ఉద్దేశ్యంతో ప్రతీ ఇంటిపై మువ్వన్నెల జెండాలు ఎగురవేసి, ఆగస్ట్ 8 నుంచి 22వరకు రాష్ట్ర వ్యాప్తంగా స్వాతంత్ర్య వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకొంటున్నాము. వీటికోసం రాష్ట్రంలో నేత కార్మికుల చేత ఒక కోటి 20 లక్షల మువ్వన్నెల జెండాలు తయారుచేయించి రాష్ట్రంలో ప్రతీ ఇంటికీ ఉచితంగా పంపిణీ చేశాము. 

నాడు స్వాతంత్ర్య పోరాటలలో తెలంగాణకు చెందిన తుర్రేబాజ్ ఖాన్, రాంజీ గోండు, మౌల్వీ అలావుద్దీన్, సరోజినీ నాయుడు, సంగెం లక్ష్మీబాయి, రామానంద తీర్థ, పీవీ నర్సింహారావు వంటివారు ఎందరో పాల్గొన్నారు. అదే స్పూర్తితో అహింసాపద్దతిలో పొరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొన్నాము. ఈ 8 ఏళ్ళలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి ఇప్పుడు దేశాభివృద్ధి, దేశానిర్మాణంలో కూడా కీలకపాత్ర పోషిస్తోంది. వ్యవసాయంలో 11.6 శాతం, పారిశ్రామికాభివృద్ధిలో 11.1 శాతం వృద్ధిరేటు సాధించాము. గ్రామీణ జీవనంలోను గణనీయమైన మార్పు కనిపిస్తోందిప్పుడు,” అని తెలిపారు.