ఈరోజు మధ్యాహ్నం ట్యాంక్‌బండ్‌పై దీనిని మిస్ అవ్వొద్దు

భారత్‌ స్వాతంత్ర్య వజ్రోత్సవాలలో భాగంగా టీఎస్‌ఆర్టీసీ కూడా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో భాగంగా ఈరోజు (శనివారం) మధ్యాహ్నం 3 గంటలకు ఆనాడు 7వ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ప్రయాణించిన అల్బేనియం బస్సును ట్యాంక్‌బండ్‌పై తిప్పనున్నారు. 1932లో నిజాం స్టేట్ రైల్ అండ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్టుమెంట్ ఈ బస్సును నడిపించింది. అప్పటి నుంచి ఈ బస్సును ఆర్టీసీ సిబ్బంది జాగ్రత్తగా కాపాడుతున్నారు. మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత ఇవాళ్ళ ట్యాంక్‌బండ్‌పై తిప్పబోతున్నందున బస్సుకు రంగులు వేసి అందంగా తీర్చిదిద్దారు. సుమారు 90 సంవత్సరాల క్రితం హైదరాబాద్‌ ప్రజలు వినియోగించుకొన్న ఈ బస్సు ట్యాంక్‌బండ్‌పై దర్శనం ఇవ్వనుంది. కనుక ఇటువంటి అపురూపమైన బస్సును మళ్ళీ ఎప్పుడో గానీ చూడటం సాధ్యం కాకపోవచ్చు. దీనితో బాటు టీఎస్‌ఆర్టీసీ నడిపిస్తున్న పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌, గరుడ, పుష్పక్ తదితర బస్సులను కూడా ట్యాంక్‌బండ్‌పై పరేడ్ చేయనున్నారు. కనుక హైదరాబాద్‌వాసులు వీలుంటే శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ట్యాంక్‌బండ్‌కు వెళ్ళగలిగితే వాటితో పాటు ఈ అపురూపమైన బస్సును చూడవచ్చు.