ఢిల్లీలో విధ్వంసానికి భారీ కుట్ర... భగ్నం

సుమారు నాలుగు దశాబ్ధాలుగా భారత్‌లో విధ్వంసాలు సృష్టించేందుకు పాక్ ప్రేరిత ఉగ్రవాదులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. నేటికీ గణతంత్ర, స్వాతంత్ర్య దినోత్సవం వంటి వేడుకలు జరుపుకోవాలంటే కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ముందుగా ఉగ్రవాదుల దాడుల గురించే ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పటిలాగే ఈసారి కూడా ఆగస్ట్ 15న ఢిల్లీలో జరుగబోయే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భారీ విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారని నిఘా వర్గాలు హెచ్చరించడంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. నిఘా వర్గాల సమాచారం మేరకు శుక్రవారం ఢిల్లీలోని ఆనంద్ విహార్‌లో సోదాలు నిర్వహించగా ఆరుగురు వ్యక్తులను పట్టుకొన్నారు. వారివద్ద నుంచి 2,251 తూటాలు స్వాధీనం చేసుకొన్నారు. 

ఢిల్లీ అసెస్టెంట్ పోలీస్ కమీషనర్ విక్రంజీత్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ, “ప్రాధమిక విచారణలో ఆ ఆరుగురు వ్యక్తులు తూటాలను ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు తరలించాలనుకొన్నట్లు తెలిసింది. వారిలో డెహ్రాడూన్‌కి చెందిన ఓ వ్యక్తి తుపాకుల వ్యాపారంలో ఉన్నట్లు గుర్తించాము. వీరికి ఉగ్రవాదులతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా?అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నాము,” అని చెప్పారు. 

 ఆగస్ట్ 15న ఢిల్లీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భారీ విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారని నిఘా వర్గాలు హెచ్చరించడంతో ఢిల్లీ పోలీసులు ఎక్కడికక్కడ వాహనాలను తనికీలు చేస్తున్నారు. రైల్వే స్టేషన్, మెట్రో స్టేషన్, బస్టాండులు, ఇతర బహిరంగ ప్రదేశాలలో పోలీసులను మోహరించి నిఘా పెంచారు.