రేపు మంత్రివర్గ సమావేశం.. మునుగోడుపై ఏం తెలుస్తారో?

రేపు (గురువారం) మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్‌లో సిఎం కేసీఆర్‌ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో మునుగోడు ఉపఎన్నికలు, రాష్ట్రా ఆర్ధిక పరిస్థితి, రుణపరిమితిపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు, ప్రత్యామ్నాయం మార్గాలు, ఆసరా పింఛన్లు, రేషన్ కార్డుల పంపిణీ, ఆగస్ట్ 15 సందర్భంగా సత్ప్రవర్తనతో మెలిగిన 75 మంది ఖైదీల విడుదల తదితర అంశాల గురించి చర్చించనున్నారు. 

ముఖ్యంగా ఎఫ్‌ఆర్‌ఎంబీకి లోబడి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొనే రుణాలలో కేంద్ర ప్రభుత్వం 15 వేల కోట్లు కోత విధించడం, కొత్తగా ఆంక్షలు విధించడంతో కొత్తగా అప్పులు పుట్టని పరిస్థితి ఏర్పడింది. దీంతో రాష్ట్రంలో అమలవుతున్న పలు అభివృద్ధి పనులు, సంక్షేమ పధకాలపై తీవ్ర ప్రభావం పడనుంది. కనుక నిధులు సమకూర్చుకోవడానికి తక్షణం ప్రత్యామ్నాయం మార్గాలు ఆన్వేషించవలసి ఉంటుంది. కనుక రేపు జరుగబోయే మంత్రివర్గ సమావేశంలో దీనిపై లోతుగా చర్చించే అవకాశం ఉంది.

మరో ముఖ్యమైన అంశం మునుగోడు ఉపఎన్నికలు. ఈ ఉపఎన్నికలను ఏవిదంగా ఎదుర్కోవాలి? టిఆర్ఎస్‌ అభ్యర్ధిగా ఎవరిని నిలబెట్టాలి? ఉపఎన్నికలకు వెళ్ళడం మంచిదా లేక ముందస్తుకు వెళ్ళడం మంచిదా?అనే అంశంపై కూడా లోతుగా చర్చించవచ్చు.