
స్థిరంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వాని అస్థిరపరిచేందుకే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేత ఎమ్మెల్యే పదవికి బిజెపి రాజీనామా చేయించి ఉపఎన్నికలు తెస్తోందని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
మంగళవారం నల్గొండలో తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ, “కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే, దానికి ఆటంకం కలిగించి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే బిజెపి వ్యూహాత్మకంగా మునుగోడు ఉపఎన్నికలు తెచ్చింది. ఇప్పటికే పలు రాష్ట్రాలలో ప్రజా ప్రభుత్వాలను అస్థిరపరిచిన మోడీ, అమిత్ షాలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంపై కన్నేశారు. రాజగోపాల్ రెడ్డిని అడ్డుపెట్టుకొని తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్, బిజెపిలు, బండి సంజయ్, రేవంత్ రెడ్డి వంటివారి వలన తెలంగాణ రాష్ట్రానికి ఎప్పటికైనా ముప్పే.
కాంట్రాక్టుల కోసమే బిజెపిలో చేరిన రాజగోపాల్ రెడ్డి మునుగోడు అభివృద్ధి కోసమే రాజీనామా చేశానని శుద్ద అబద్దాలు చెపుతున్నారు. ఐదేళ్ళు ఎంపీగా, మూడేళ్ళు ఎమ్మెల్సీగా చేసినప్పుడు నియోజకవర్గాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదు?చేజేతులా మునుగోడు ఉపఎన్నికలను తెచ్చుకొన్న రాజగోపాల్ రెడ్డి ఆ ఉపఎన్నికలలో మునగడం ఖాయం. మునుగోడు ఉపఎన్నికలకు టిఆర్ఎస్ అభ్యర్ధిగా ఎవరిని నిలపాలనే దానిపై సిఎం కేసీఆర్ అన్ని కోణాలలో నుంచి ఆలోచించి నిర్ణయం తీసుకొంటారు. ఒకవేళ నన్ను పోటీ చేయమని కోరితే తప్పకుండా ఆలోచిస్తాను,” అని అన్నారు.