14.jpg)
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పార్టీలో నుంచి వెళ్ళిపోకుండా కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతో ఇంతకాలం మౌనంగా ఉండిపోయిన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు నిన్న ప్రకటించడంతో ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణ ఇచ్చిన తల్లివంటి సోనియా గాంధీని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెన్నుపోటు పొడిచారు. ఈడీని అడ్డుపెట్టుకొని సోనియా గాంధీపై రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్న ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షాలతో రాజగోపాల్ రెడ్డి చేతులు కలపడం నమ్మకద్రోహమే. ఆయనకు మనిషినని చెప్పుకొనే అర్హత కూడా లేదు.
ఆయనకు కాంగ్రెస్ పార్టీలో ఎవరికీ ఈయనంత ప్రాధాన్యం, గౌరవం ఇచ్చింది. ఆయన ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. ఎమ్మెల్సీ ఉండగానే ఎమ్మెల్యే పదవి ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ వలననే ఆయనకు ఈ గుర్తింపు, గౌరవం లభించాయనే సంగతి ఆయనకీ తెలుసు. కానీ ఆయన కన్నతల్లి వంటి సోనియా గాంధీని, కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడవడమే కాకుండా కాంగ్రెస్‌ను దెబ్బ తీయాలని చూస్తున్న బిజెపి పంచన చేరుతూ చాలా దిగజారిపోయారు.
ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే అక్కడే ఆయనను ఓడించి ప్రతీకారం తీర్చుకొంటాము. ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యత ఆయనే తీసుకొంటారు,” అని రేవంత్ రెడ్డి అన్నారు.