
తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు టిఆర్ఎస్ను వీడి బిజెపిలో చేరేందుకు సిద్దం అవుతున్నారు. ఇవాళ్ళ ఆయన వరంగల్‌లో తన అనుచరులతో సమావేశమయ్యి చర్చించిన తరువాత పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరుతున్నట్లు ప్రకటించే అవకాశం ఉంది. ప్రదీప్ రావు ఇప్పటికే బిజెపిలో చేరికల కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్‌తో రెండుసార్లు భేటీ అయ్యి బిజెపిలో చేరే విషయంపై చర్చించారు. కనుక ప్రదీప్ రావు బిజెపిలో చేరడం ఖాయంగానే భావించవచ్చు.
తెలంగాణ కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి సోదరులలో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బిజెపిలో చేరబోతుండగా, టిఆర్ఎస్లో కూడా ఎర్రబెల్లి సోదరులలో ప్రదీప్ రావు బిజెపిలో చేరబోతుండటం యాదృచ్చికమే అయినప్పటికీ చాలా ఆసక్తికరంగా మారింది. వారివురూ బిజెపిలో చేరడంతో కాంగ్రెస్‌లో ఉన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, టిఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు రాజకీయంగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవలసిరావచ్చు.
టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన కొత్తలో కాంగ్రెస్, టిడిపి ఎమ్మెల్యేలను, నేతలను సిఎం కేసీఆర్ పార్టీలోకి ఆకర్షించి వాటిని నిర్వీర్యం చేస్తే ఇప్పుడు టిఆర్ఎస్ నేతలను ఆకర్షించి టిఆర్ఎస్ను బలహీనపరచడానికి బిజెపి ప్రయత్నిస్తుండటం విశేషం. టిఆర్ఎస్లోకి వెళ్ళిన కాంగ్రెస్ నేతలను వెనక్కు రప్పించుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ కూడా గట్టి ప్రయత్నాలే చేస్తోంది.