కాంగ్రెస్‌కు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గుడ్ బై!

దాదాపు రెండేళ్ళుగా బిజెపీలో చేరేందుకు ఊగిసలాడుతున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎట్టకేలకు మంగళవారం సాయంత్రం పార్టీకి, తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 

హైదరాబాద్‌లో తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ, “నేను చాలా బాధతో కాంగ్రెస్ పార్టీని వీడుతున్నాను. నాకు కాంగ్రెస్ పార్టీ అన్నా, సోనియా గాంధీ అన్నా చాలా గౌరవం. అందుకే వారిపై విమర్శలు చేయబోను. కాంగ్రెస్‌ని వీడుతున్నప్పుడు ఆ పార్టీ ద్వారా లభించిన ఎమ్మెల్యే పదవిని అట్టేబెట్టుకొని ప్రజలలో తిరగలేను. అందుకే ఒకటి రెండు రోజుల్లో నా పదవికి కూడా రాజీనామా చేస్తాను. 

సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినప్పటికీ కాంగ్రెస్‌ అధిష్టానం తీసుకొన్న కొన్ని తప్పుడు నిర్ణయాల వలన రాష్ట్రంలో అధికారంలోకి రాలేకపోగా పార్టీ బలహీనపడింది. సోనియా గాంధీని దూషించినవారికే పార్టీ పగ్గాలు అప్పగించి వారి కింద మావంటి పార్టీ విధేయులను పనిచేయమని ఆశించారు. అది సాధ్యం కాదు. ఇదే విషయం చెపితే పార్టీ వ్యతిరేకిననే ముద్రవేస్తున్నారు తప్ప మేము చెపుతున్నవాటి గురించి ఆలోచించడం లేదు. కాంగ్రెస్‌ పార్టీ బలహీనపడటం వలన టిఆర్ఎస్‌తో పోరాడే శక్తి లేదు. నేను పార్టీ వీడటానికి ఇదీ ఓ కారణమే.       

తెలంగాణలో సిద్ధిపేట, గజ్వేల్, సిరిసిల్లా నియోజకవర్గాలకు తప్ప మరే నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు ఇవ్వడం లేదు. కేసీఆర్‌ ఫామ్ హౌస్ చుట్టూ అమెరికాలో ఉన్నట్లు రోడ్లు వేయించుకొన్నారు. కానీ నిత్యం వేలాదిమంది తిరిగే చౌటుప్పల్-నారాయణపురం రోడ్డు గుంతలు పడి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోలేనప్పుడు ఇంకా నేను ఎమ్మెల్యే పదవిలో ఉండి ప్రయోజనం లేదు. హుజురాబాద్‌ ఉపఎన్నిక వచ్చిన్నప్పుడే ఆ నియోజకవర్గాన్ని కేసీఆర్‌ అభివృద్ధి చేశారు. అలాగే     మునుగోడు నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధిచేస్తారనే రాజీనామా చేస్తున్నాను.

టిఆర్ఎస్‌ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు గౌరవం లేదు. కేసీఆర్‌ ఇష్టం వచ్చినట్లు అప్పులు చేస్తూ తెలంగాణను అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేశారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అస్తవ్యస్తమైంది. ఏదో రోజు శ్రీలంకలా మారినా ఆశ్చర్యం లేదు.      

కనుక కేసీఆర్‌ నియంతృత్వ, అప్రజాస్వామిక ప్రభుత్వాన్ని గద్దె దించి రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలిగే సత్తా ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షాల నాయకత్వంలో పనిచేసే బిజెపికే ఉందని నమ్ముతున్నాను. కోమటిరెడ్డి బ్రదర్స్ డబ్బు, పదవులు, అధికారానికి అమ్ముడుపోయే వ్యక్తులు కారని నల్గొండ జిల్లా ప్రజలందరికీ తెలుసు. నియోజకవర్గం అభివృద్ధి కోసమే నేను ఈ నిర్ణయం తీసుకొన్నాను. నా నిర్ణయం తప్పనుకొంటే ప్రజలు క్షమించాలని కోరుతున్నాను. ఒకవేళ నా నిర్ణయం సరైనదని భావిస్తే నా వెంట నడవాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.