అపుడే బండి ముఖ్యమంత్రి కలలు!

తెలంగాణలో సిఎం కేసీఆర్‌కు పక్కలో బల్లెంలా మారిన ఆ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ నేటి నుంచి మూడో విడత ప్రజాసంగ్రామ పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా నేడు యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరి గుట్ట వద్ద జరిగిన బిజెపి బహిరంగసభలో మాట్లాడుతూ, “తెలంగాణలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి రాబోతోంది. ఎన్నికలలో గెలిచిన తరువాత మొదట భాగ్యలక్ష్మీ అమ్మవారి దర్శనం చేసుకొన్నాకనే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తాం,” అన్నారు. ఆ తరువాత సిఎం కేసీఆర్‌ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అది మామూలే. 

అయితే బండి సంజయ్‌ తొలిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం గురించి ఈరోజే మాట్లాడారు. తెలంగాణలో జీరో నుంచి అధికారంలోకి రాగలమనే నమ్మకం కలిగించే స్థాయికి పార్టీని తీసుకువెళ్ళినందుకు బండి సంజయ్‌ తదుపరి ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకోవడం సహజమే. అయితే ఇటువంటి మాటలు ఇప్పుడే పలకడం పార్టీలో గ్రూపులు తయారయ్యేందుకు దోహదపడతాయి తప్ప మరి దేనికీ పనికిరావు. 

కాంగ్రెస్ నేతలు ఇదే తప్పు చేసి పార్టీని నిలువునా ముంచుకొన్నారు. కనుక బండి సంజయ్ ముందు సిఎం కేసీఆర్‌ నేతృత్వంలోని అతిరధమహారధులతో నిండి ఉన్న టిఆర్ఎస్‌ను ఏవిదంగా ఎదుర్కోవాలో ఆలోచిస్తే మంచిది. బిజెపి రాజకీయంగా దూసుకువెళుతూ కేసీఆర్‌ కంచుకోటను పగులగొట్టి లోనికి ప్రవేశించాలని ప్రయత్నిస్తోంది. మహారాష్ట్రలో తిరుగేలేదనుకొనే శివసేన ప్రభుత్వాన్ని బిజెపి రాజకీయవ్యూహాలతోనే దెబ్బ తీసి అధికారం చేజిక్కించుకొంది. ఇప్పుడు టిఆర్ఎస్‌లో కట్టప్పల సాయంతో కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కూడా అదేవిదంగా గద్దె దించుతామని బిజెపి బహిరంగంగానే హెచ్చరిస్తోంది. 

కనుక సిఎం కేసీఆర్‌ కూడా ఇప్పటి నుంచే బిజెపిని ఎదుర్కోవడానికి అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకొంటున్నారు. ఈసారి కూడా ప్రతిపక్షాలకు ఎక్కువ సమయం ఇవ్వకుండా అకస్మాత్తుగా ముందస్తు ఎన్నికలకి వెళ్ళి ఎన్నికల వైతరిణిని దాటి మళ్ళీ అధికారం చేజిక్కించుకోవాలని సిఎం కేసీఆర్‌ యోచిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ముందస్తుకు వెళ్ళకపోయినా వచ్చే ఏడాది ఈ సమయానికి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ బలాబలాలపై మరింత స్పష్టత రావచ్చు.