బెల్లంపల్లి కమీషనర్‌ అత్యుత్సాహం.. సస్పెన్షన్ వేటు

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ కమీషనర్ గోపు గంగాధర్ అత్యుత్సాహం ప్రదర్శించినందుకు సస్పెన్షన్ వేటు పడింది. ఈ నెల 24వ తేదీన రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయన బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రిలో కేటీఆర్‌ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఆ రోజు ఆదివారం కావడంతో నలుగురు ఉద్యోగులు ఆ వేడుకలకి హాజరు కాలేదు. దాంతో ఆ నలుగురినీ సంజాయిషీ కోరుతూ కమీషనర్ మెమో జారీ చేశారు. ఈ విషయం మీడియాలో వైరల్ అవడంతో మంత్రి కేటీఆర్‌ దృష్టికి వచ్చింది. గోపు గంగాధర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని కేటీఆర్‌ పురపాలకశాఖ కమీషనర్‌ను ఆదేశించారు. 

ఇదే విషయం ట్విట్టర్‌లో తెలియజేస్తూ, “రాజకీయాల్లో, పాలనలో వ్యక్తిపూజను నేను ప్రోత్సహించను. నా జన్మదిన వేడుకలకు హాజరుకాలేదని బెల్లంపల్లి కమీషనర్ సిబ్బందికి మెమో జారీ చేసినట్లు నా దృష్టికి వచ్చింది. ఇటువంటి అసంబద్దమైన వైఖరిని ప్రదర్శించిన కమీషనర్‌ను సస్పెండ్ చేయాలని నేను పురపాలకశాఖ కమీషనర్‌ను ఆదేశించాను,” అని తెలియజేశారు. 

ఇది చాలా మంచి నిర్ణయమే అయితే టిఆర్ఎస్‌తో సహా అన్ని పార్టీలలో వ్యక్తిపూజతోనే నడుస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. కేటీఆర్‌తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నేతలు సిఎం కేసీఆర్‌ భజన చేస్తుండటం, మిగిలినవారు కేటీఆర్‌ భజన చేస్తుండటం, వారికి వారి అనుచరులు భజన చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.  వివిద సందర్భాలలో కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకాలు వ్యక్తిపూజకు నిదర్శనమే కదా? కనుక వ్యక్తిపూజ అన్ని పార్టీల నరనరాల్లో ఇంకిపోయినందునే కమీషనర్ కూడా ఈవిదంగా చేశారని చెప్పకతప్పదు.