
క్యాసినో నిర్వాహకులు చికోటి ప్రవీణ్, మాధవరెడ్డిల నివాసాలు, కార్యాలయాలపై ఈడీ బృందాలు నిన్న దాడులు చేసినప్పుడు మాధవరెడ్డి ఉపయోగిస్తున్న ఓ కారుపై తెలంగాణ కార్మికశాఖ మంత్రి చేమకూర మల్లారెడ్డికి కేటాయించిన ఎమ్మెల్యే స్టిక్కర్ అంటించి ఉంది.
దానిపై మంత్రి మల్లారెడ్డి స్పందిస్తూ, “ఆ స్టిక్కర్ నా వాహనానిదే కానీ దాని గడువు ముగిసిపోవడంతో నాలుగు నెలల క్రితం తీసి బయటపడేశాను. ఆ తరువాత దానిని ఎవరు వాడుకొంటున్నారో నాకు ఎలా తెలుస్తుంది?దానితో నాకు సంబంధం ఏమిటి?” అని ప్రశ్నించారు.
అయితే ఎమ్మెల్యే స్టిక్కర్ గడువు తీరిపోతే ఎవరూ దానిని తీసి రోడ్డుపై పడేయరనే సంగతి అందరికీ తెలుసు. నిబందనల ప్రకారం గడువు ముగిసిన స్టిక్కర్లను సంబందిత అధికారులకు అప్పగిస్తే కొత్త స్టిక్కర్లను ముద్రించి ఇస్తుంటారు. కానీ మంత్రి మల్లారెడ్డి అదేదో చిత్తు కాగితమన్నట్లు తీసి బయటపడేశానని నమ్మబలుకుతున్నారు.
ఆయన తీసి బయట పడేస్తే కోట్ల రూపాయల బిజినెస్ చేస్తున్న క్యాసినో నిర్వాహకుడు మాధవరెడ్డి వెంటనే వచ్చి దానిని రోడ్డుపై ఏరుకొని తీసుకువెళ్ళి తన కారుకు అంటించుకొన్నాడా?ఒకవేళ తనకు కేటాయించిన ఆ స్టిక్కర్ ఏ ఉగ్రవాదో వాడుకొని విధ్వంసం సృష్టిస్తే అప్పుడూ మంత్రి మల్లారెడ్డి ఇదేవిదంగా సమాధానం చెప్పగలరా?
క్యాసినో నిర్వాహకులు చికోటి ప్రవీణ్, మాధవరెడ్డిలకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని మీడియాలో వార్తలు వస్తున్న నేపధ్యంలో మంత్రి మల్లారెడ్డి మాటలు నమ్మశక్యంగా లేవని అర్దమవుతూనే ఉంది. ఒకవేళ ఈ వ్యవహారాలలో మంత్రిగారి పేరు కూడా ఉంటే త్వరలోనే ఈడీ అధికారులు ఆయన ఇంటి తలుపు కూడా తట్టడం ఖాయం. అప్పుడు కూడా మంత్రిగారు స్టిక్కర్ గురించి ఇదే కధ చెప్పుతారేమో చూద్దాం.