ఈటల విశ్వాస ఘాతకుడు.. గవర్నర్‌ బిజెపి తొత్తు!

హుజురాబాద్‌ బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ వచ్చే ఎన్నికలలో తాను గజ్వేల్ నుంచి కేసీఆర్‌పై పోటీ చేసి ఒడిస్తానని సవాళ్ళు విసురుతుండటం, సిఎం కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు పనులలో జోక్యం చేసుకోవడం వలననే దాని కింద పలు ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయని విమర్శలు గుప్పిస్తున్నారు. 

వాటిపై ప్రభుత్వ విప్ బాల్క సుమన్ స్పందిస్తూ, “2004కు ముందు ఈటల రాజేందర్‌ ఎవరో తెలంగాణ ప్రజలకు కూడా తెలీదు. కేసీఆర్‌ చేరదీయడంతో ఎమ్మెల్యే అయ్యారు. తరువాత రెండుసార్లు మంత్రి పదవి కూడా పొందారు. కానీ కృతజ్ఞతలేని విశ్వాసఘాతకుడు ఈటల రాజేందర్‌. తనను చేరదీసి అంత గుర్తింపు, గౌరవం, మంత్రి పదవులు ఇచ్చిన కేసీఆర్‌నే దెబ్బతీయాలని చూశారు. ఆర్ధిక మంత్రిగా, ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈటల రాజేందర్‌ చాలా అవినీతికి పాల్పడ్డారు. ఇప్పుడు బిజెపిలో బానిసలా బ్రతుకుతూ పబ్లిసిటీ కోసమే ప్రగల్భాలు పలుకుతున్నారు. అయితే వచ్చే ఎన్నికలలో ఆయన హుజురాబాద్‌ నుంచే మళ్ళీ పోటీ చేసిన ఓడిపోవడం ఖాయం. ఇక గజ్వేల్ నుంచి సిఎం కేసీఆర్‌పై పోటీ చేయడం, గెలవడం కలలో కూడా జరిగేవి కావు. టిఆర్ఎస్‌ నుంచి బహిష్కరించబడినప్పుడే ఆయన రాజకీయంగా పతనమయ్యారు. ఇప్పుడు ఆయన ఓ చెల్లని రూపాయి నాణెం వంటివారు మాత్రమే,” అని అన్నారు. 

సిఎం కేసీఆర్‌ చెప్పిన ‘క్లౌడ్ బరస్ట్-విదేశీ కుట్ర’ గురించి ఇటీవల గవర్నర్‌ మీడియాతో మాట్లాడుతూ, “అదేమీ క్లౌడ్ బరస్ట్ కాదు.. విదేశీ కుట్రలేదు. ఎగువన మహారాష్ట్రలో ఈసారి భారీగా వర్షాలు కురుస్తుండటంతో ఆ వరద నీరు కాళేశ్వరం ప్రాజెక్టులోకి వచ్చింది తప్ప మరేమీ లేదు,” అని అన్నారు. మళ్ళీ నిన్న ఢిల్లీలో “ప్రోటోకాల్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీరు మారనప్పటికీ నేను చీటికి మాటికీ బరస్ట్ అవను...” అని వ్యంగ్యంగా అన్నారు. అది సిఎం కేసీఆర్‌ చెప్పిన ‘క్లౌడ్ బరస్ట్’ మాట పట్టుకొనే ఆమె ఆవిదంగా అన్నారని అర్దమవుతూనే ఉంది. 

కనుక బాల్క సుమన్ ఆమెపై కూడా నిప్పులు చెరిగారు. “క్లౌడ్ బరస్ట్ గురించి మాట్లాడటానికి గవర్నర్‌ ఏమైనా శాస్త్రవేత్తా? కేసీఆర్‌ ఎప్పుడు ఎన్నికలకి వెళతారో? జాతీయ రాజకీయాలలోకి వెళతారో లేదో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కి ఎందుకు? గతంలో గవర్నర్లు హుందాగా ప్రవర్తించారు. ఇలాగ ఎవరూ ప్రవర్తించలేదు. అసలు ఆమె రాజకీయాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఒకవేళ ఆమె రాజకీయాలు చేయాలనుకొంటే బిజెపి కండువా కప్పుకొని మాట్లాడితే బాగుంటుంది,” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.