ద్రౌపదీ ముర్ము నేడు రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం

ద్రౌపదీ ముర్ము నేడు భారత 15వ రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆమె చేత ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర మంత్రులు, అధికార, విపక్ష ఎంపీలు అందరూ పాల్గొంటారు. అనంతరం ఆమె రాష్ట్రపతి అధికార నివాసమైన రాష్ట్రపతి భవన్‌లోకి మారుతారు. 

భారతదేశానికి స్వాత్రంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టినవారిలో తొమ్మిది మంది జూలై 25వ తేదీనే రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేశారు. గత 45 ఏళ్ళుగా ఇదే ఆనవాయితీ కొనసాగుతోంది. ఆ ప్రకారమే నేడు ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఒడిశాలోని మారుమూల గ్రామంలో నిరుపేద గిరిజన కుటుంబంలో జన్మించిన ద్రౌపదీ ముర్ము అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు దేశంలో అత్యున్నతమైన ఈ పదవిని చేపట్టనున్నారు.