ఆగస్ట్ 2నుంచి బండి సంజయ్‌ ప్రజా సంగ్రామయాత్ర

తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆగస్ట్ 2వ తేదీ నుంచి మూడవ విడత ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభించబోతున్నారు. యాదగిరిగుట్టలో బహిరంగ సభ నిర్వహించి అక్కడి నుంచి వరంగల్‌ భద్రకాళి ఆలయం వరకు పాదయాత్ర చేయాలని సూత్రప్రాయంగా అందరూ అంగీకరించారు. శుక్రవారం నాంపల్లి పార్టీ కార్యాలయంలో బండి సంజయ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావు, మనోహర రెడ్డి, మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ తదితరులు పాల్గొని ప్రజాప్రస్థానం పాదయాత్ర రూట్ మ్యాప్, అజెండా, ఏర్పాట్లు తదితర అంశాలపై  చర్చించారు. పార్టీ ఇన్‌ఛార్జి తరుణ్‌ఛుగ్‌ జూమ్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆగస్ట్ 6వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగనున్నందున ఆ ఒక్కరోజు పాదయాత్రకు విరామం ఇచ్చి మళ్ళీ మర్నాటి నుంచి యదాతదంగా కొనసాగించాలని నిర్ణయించారు. పాదయాత్ర రూట్ మ్యాప్, పాదయాత్రలో కవర్ చేయవలసిన నియోజకవర్గాలపై మరోసారి చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు.