
తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ బుదవారం సైఫాబాద్‌లో దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బిజినెస్ ఫెసిలిటేషన్ సెంటర్, మోడలో కేరీర్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చాలా ఆలోచనాత్మకమైన ప్రసంగం చేశారు.
“అమెరికా అధ్యక్షుడు జోబైడెన్కైనా, ప్రధాని నరేంద్రమోడీకైనా, తెలంగాణ సిఎం కేసీఆర్‌కైనా అందరికీ ఒకటే సవాల్ ఎదుర్కొంటున్నారు. అదే నిరుద్యోగ సమస్య! లక్షలమంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించడం ప్రభుత్వంలో లేదా ప్రభుత్వ రంగ సంస్థలలో ఉద్యోగాలు కల్పించడం అసంభవం. కనుక యువత స్వయంఉపాధి ఏర్పాటు చేసుకొని మరికొంతమందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలనే ఉద్దేశ్యంతో టీహబ్ వంటి విన్నూత్నమైన ఆలోచనలతో ముందుకు సాగుతున్నాం.
దేవుడు మనుషులు అందరినీ ఒకేలా పుట్టించాడు కానీ అందరికీ అవకాశాలు కల్పించలేదు. అటువంటి వారికి మా ప్రభుత్వం అవకాశాలు కల్పించి వారి కాళ్ళపై వారు నిలబడేలా చేసేందుకు ప్రయత్నిస్తోంది. అదే దళిత బంధు పధకం. అయితే ఇదేదో పల్లీలు, పుట్నాలపప్పు పంచిపెట్టినట్లు అందరికీ డబ్బు పంచిపెట్టేందుకు ఉద్దేశ్యించిన పధకం కాదు. సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్నవారికి దీని ద్వారా చేయూతనందించి వారికీ జీవితంలో పైకి ఎదిగేందుకు ఉద్దేశ్యించినదే ఈ పధకం. ఈ ప్రపంచంలో రెండే కులాలు ఉన్నాయని నేను నమ్ముతున్నాను. ఒకటి ధనిక కులం రెండోది పేద కులం. అటువంటి వారికి చేయూతనందించి సమానావకాశాలు కల్పించడమే మా ప్రభుత్వ లక్ష్యం,” అని అన్నారు.