యువతిపై అత్యాచారం.. అజ్ఞాతంలో బిజెపి ఎమ్మెల్యే

అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో లోకం తస్సార్ అనే బిజెపి ఎమ్మెల్యే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఆయన తనపై అత్యాచారం చేశాడని ఓ యువతి ఈటానగర్‌లో పోలీస్ స్టేషన్లో జూలై 4వ తేదీన ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలియగానే ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళి అప్పటి నుంచి పోలీసులకు చిక్కకుండా తప్పించుకొంటున్నారు. తన లాయర్ ద్వారా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించగా సోమవారం కోర్టు నిరాకరించింది. 

ప్రస్తుతం ఆయన కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయని పోలీస్ సూపరింటిండెంట్ నీలం రేగ చెప్పారు. నిన్న రాష్ట్రపతి ఎన్నికలలో ఓటు వేసేందుకు వస్తే అరెస్ట్ చేద్దామని చూశామని కానీ ఆయన రాలేదని చెప్పారు. బిజెపి ఎమ్మెల్యే యువతిపై అత్యాచారం చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో ఆ రాష్ట్రంలో ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి పెమా ఖండూ అతనిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారంటూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రతిపక్షాలు విమర్శలపై స్పందిస్తూ, “మా ఎమ్మెల్యే ఇటువంటి హేయమైన నేరానికి పాల్పడి ఉంటే అది చాలా తప్పు. ఒకవేళ అతను ఈ నేరం చేసినట్లు రుజువైతే, పార్టీ, ప్రభుత్వం నుంచి బహిష్కరించి చట్ట ప్రకారం చర్యలు తీసుకొంటాము,” అని చెప్పారు.