ఏడాదిలోగా వరంగల్‌లో హాస్పిటల్ నిర్మాణం పూర్తిచేస్తాం

ఇదివరకు వరంగల్‌ సెంట్రల్ జైలు ఉన్న ప్రాంతంలో రూ.1,200 కోట్లు వ్యయంతో 53 ఎకరాల విస్తీర్ణంలో 24 అంతస్తులతో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌  నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు, సోమవారం మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్, వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్,మేయర్ గుండు సుధారాణి, ఎంజీఎం హాస్పిటల్‌ సూపరింటెండెంట్ డాక్టర్ వి. చంద్రశేఖర్ తదితరులతో కలిసి వరంగల్‌ హాస్పిటల్‌ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. అనంతరం మంత్రి హరీష్‌ రావు మీడియాతో మాట్లాడుతూ, “ప్రస్తుతం 700 మంది కార్మికులు నిర్మాణ పనులలో పాల్గొంటున్నారు. దసరా పండుగ తరువాత 2,500 కార్మికులతో పనులు వేగవంతం చేస్తాము. హాస్పిటల్‌ నిర్మాణ పనులు 12 నెలల్లోగా పూర్తిచేసి ఆ తరువాత రెండు మూడు నెలల్లోగా హాస్పిటల్‌లో వైద్యులు, సిబ్బంది నియమకాలు చేపడతాము. 24 అంతస్తులలో 16 అంతస్తులలో హాస్పిటల్‌ ఉంటుంది. మిగిలిన 8 అంతస్తులలో వైద్య కళాశాల, సెమినార్ హాల్స్, లైబ్రేరి వగైరా ఉంటాయి,” అని చెప్పారు.