పోలవరంతో భద్రాచలానికి ముప్పు : మంత్రి పువ్వాడ

ఇటీవల భద్రాచలం పట్టణంతో సహా పరిసర ప్రాంతాలు వరద నీటిలో మునగడంతో అది ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మద్య మళ్ళీ మరో కొత్త యుద్ధానికి దారితీసింది. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ మంగళవారం టిఆర్ఎస్‌ శాసనసభాపక్ష కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “ఏపీలో నిర్మిస్తున్న పోలవరం ఎత్తు పెంచితే ఖమ్మం జిల్లాలో ఏడు మండలాలు ముంపుకు గురవుతాయని మేము ఇదివరకే చెప్పాము. మొన్న భారీ వరదలు వచ్చినప్పుడు భద్రాచలం పట్టణంలోకి కూడా నీళ్ళు వచ్చాయి. కనుక పోలవరం ఎత్తు తగ్గించాలని మేము ఇదివరకు అడిగాము. మళ్ళీ ఇప్పుడూ అడుగుతున్నాము. అలాగే ఖమ్మం జిల్లాలో ఏడు మండలాలు, భద్రాచలం పక్కనే ఉన్న 5 గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని కోరుతున్నాము. భద్రాచలం పట్టణం, పరిసర గ్రామాలు ముంపుకు గురవకుండా ఉండేందుకు కరకట్ట ఎత్తు పెంచేందుకు చర్యలు చేపడుతున్నాము,” అని అన్నారు. 

మంత్రి పువ్వాడ వ్యాఖ్యలపై ఏపీ విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ, “పోలవరంతో భద్రాచలానికి ఎటువంటి ముప్పు లేదు. అక్కడ ఏ కారణం చేత ముంపుకు గురవుతుందో దానిని పరిష్కరించుకోవాలి కానీ ఈ వంకతో ఏపీలో భాగమైన మండలాలను తెలంగాణలో విలీనం చేయాలని కోరడం సబబు కాదు. ఆ లెక్కన రాష్ట్రం విడిపోయినప్పుడు హైదరాబాద్‌ తెలంగాణకు వెళ్ళిపోవడం వలన ఏపీకి ఆదాయం తగ్గిపోయి చాలా నష్టం జరిగింది. కనుక హైదరాబాద్‌ను ఏపీలో విలీనం చేయమని అడిగామా? లేదు కదా?ఒకవేళ తెలంగాణను ఏపీలో మళ్ళీ విలీనం చేసేందుకు వారు సిద్దమైతే మాకేమీ అభ్యంతరం లేదు. మంత్రిగా ఉన్న పువ్వాడ బాధ్యతగా మాట్లాడాలి. ఈ సమస్యపై రాజకీయం చేయడం సరికాదు,” అని అన్నారు.