నేను క్రాస్ ఓటింగ్ చేయలేదు: సీతక్క

ఈరోజు రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క పొరపాటున తమ పార్టీ బలపరిచిన యశ్వంత్ సిన్హాకు బదులు బిజెపి అభ్యర్ధి ద్రౌపదీ ముర్ముకి ఓటువేసినట్లు మీడియాలో విస్తృతంగా వార్తలు వచ్చాయి. 

వాటిపై సీతక్క స్పందిస్తూ, “నేను క్రాస్ ఓటింగ్‌కు పాల్పడలేదు. మీడియాలో వస్తున్న వార్తలను నేను ఖండిస్తున్నాను. ఈరోజు ఉదయం నేను ఓటు వేయడానికి వచ్చినప్పుడు రిటర్నింగ్ అధికారులు నాకు ఓ బ్యాలెట్ పేపర్ ఇచ్చారు. దానిపై ఇంకు మరక ఉన్నట్లు నేను గుర్తించి దానిని వాపసు చేసి నాకు వేరే బ్యాలెట్ పేపర్ ఇమ్మనమని అడిగాను. సుమారు గంటసేపు నిలబెట్టిన తరువాత బ్యాలెట్ పేపర్ మార్చడం సాధ్యం కాదని, దానితోనే ఓటు వేయాలని వారు సూచించారు. అప్పుడు నేను అదే బ్యాలెట్ పేపర్ ఉపయోగించుకొని ఓటు వేశాను. కానీ మీడియాలో నా గురించి తప్పుగా వార్తలు రావడం చూసి స్పందిస్తున్నాను. నేను విలువలకు కట్టుబడి ఉండే వ్యక్తిని. నాకు క్రాస్ ఓటింగ్ చేయాల్సిన అవసరం లేదు,” అని చెప్పారు. 

 రాష్ట్రపతి ఎన్నికల నిబందన ప్రకారం ఈ ప్రక్రియలో ఓటర్లుగా ఉండే ఎమ్మెల్యేలు, ఎంపీలకు వారి పార్టీలు విప్ జారీ చేయడానికి వీలులేదు. అందరూ స్వేచ్ఛగా తమకు నచ్చిన అభ్యర్ధికి ఓటు వేయవచ్చు. ద్రౌపదీ ముర్ము, సీతక్క ఇద్దరూ కూడా గిరిజనులే కనుక సీతక్క యశ్వంత్ సిన్హాకు బదులు ఆమెకు ఓటు వేసి ఉండవచ్చనే అభిప్రాయంతో మీడియా ఆవిదంగా ఊహించి ఉండవచ్చు. కానీ సీతక్క తాను కాంగ్రెస్‌ బలపరిచిన యశ్వంత్ సిన్హాకే ఓటు వేశానని చెప్పారు.