ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ని తప్పించాల్సిందే

వికారాబాద్‌ జిల్లాలో టిఆర్ఎస్‌లో కుమ్ములాటలు రాళ్ళ దాడులు చేసుకొనేవరకు వచ్చాయి. ఇటీవల జెడ్పీ ఛైర్ పర్సన్‌ సునీతా మహేందర్ రెడ్డి మర్పల్లిలో మహిళా భవనం ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అనుచరులు ‘మర్పల్లి గడ్డ... ఆనంద్ అడ్డా...’ అంటూ నినాదాలు చేస్తూ ఆమె కారును అడ్డుకొని, రాళ్ళతో దాడి చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేయే అనుచరులను తనపైకి ఉసిగొల్పడంతో ఆమె షాక్ అయ్యారు. 

అనంతరం ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ “ఇంతకాలం ఎమ్మెల్యే ఆనంద్ నన్ను రాజకీయంగా దెబ్బతీసేందుకు ఎంతగా ప్రయత్నిస్తున్నా ఒకే పార్టీలో ఉన్నాము కదా బహిరంగంగా మాట్లాడితే బాగుండదని మౌనం వహిస్తున్నాను. కానీ నేను వెనక్కు తగ్గుతున్నకొద్దీ ఆనంద్ చాలా రెచ్చిపోతున్నాడు. నా కారుపై తన అనుచరులతో రాళ్ళ దాడి చేయించడాన్ని నేను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళి, ఆయనపై చర్యలు తీసుకోవలసిందిగా కోరుతాను. జిల్లా పార్టీ అధ్యక్ష పదవిలో ఉండేందుకు ఆనంద్‌ ఎంతమాత్రం అర్హుడు కాడు. అతనిని ఆ పదవి నుంచి తొలగించాల్సిందే,” అని సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. 

తన గురించి ఆమె చేసిన ఈ తీవ్ర వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ఆనంద్ చాలా తాపీగా స్పందించారు. “సునీతక్కపై దాడి దురదృష్టకరం. ఆమెతో నేను స్వయంగా మాట్లాడి ఆమెకు నాతో ఏమైనా సమస్య ఉంటే పరిష్కరించుకొంటాను,” అని చెప్పారు.