నీట మునిగిన లక్ష్మీ సరస్వతి పంప్‌హౌస్‌లు

టిఆర్ఎస్‌ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన రెండు పంప్‌హౌస్‌లు గోదావరి వరద నీటిలో మునిగిపోయాయి. మేడిగడ్డలోని లక్ష్మీ పంప్‌హౌస్‌, అన్నారంలోని సరస్వతి పంప్‌హౌస్‌లలోకి భారీగా వరద నీరు చేరడంతో మోటర్లు, వాటికి సంబందించిన ఎలెక్ట్రిక్ ప్యానల్ బోర్డులు వగైరా అన్నీ నీట మునిగాయి. 

లక్ష్మీ పంప్‌హౌస్‌లో 17, సరస్వతి పంప్‌హౌస్‌లో 12 మోటర్లు నీట మునిగాయి. ప్రాధమిక అంచనా ప్రకారం సుమారు రూ.500 కోట్లు నష్టం వాటిల్లి ఉండవచ్చని తెలుస్తోంది. కానీ వరద తగ్గిన తరువాత రెండు పంప్‌హౌస్‌లలో పూర్తిగా నీళ్ళు తోడిపోసిన తరువాతే ఎంత నష్టం వాటిల్లిందనేది తెలుస్తుందని అధికారులు చెపుతున్నారు. 

మోటర్లను వేడి చేసి ఆరబెట్టడం ద్వారా వాటిని తిరిగిపని చేయించే అవకాశం ఉంది కానీ నీళ్ళలో మునిగిన విద్యుత్‌ పరికరాలు, ప్యానల్ బోర్డుల సంగతి ఇప్పుడే చెప్పేలేమని అధికారులు చెప్పారు. ఏది ఏమైనప్పటికీ, మళ్ళీ రెండు పంప్‌హౌస్‌లు తిరిగి పనిచేయడానికి మరో 5-6 నెలలు పైనే పట్టవచ్చని తెలిపారు. 

వరద పోటెత్తితే ఇటువంటి సమస్య ఏర్పడవచ్చని నిపుణులు ముందే హెచ్చరించారు. వారు హెచ్చరించినట్లే సరస్వతి పంప్‌హౌస్‌లోకి ఇదివరకు నీళ్ళు వచ్చాయి కూడా. వేలకోట్లు ఖర్చు చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన రెండు పంప్‌హౌస్‌లు మునిగిపోవడంతో అప్పుడే ప్రతిపక్షాలు సిఎం కేసీఆర్‌ను తీవ్రంగా విమర్శిస్తున్నాయి. 

రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పందిస్తూ, “కాళేశ్వరం ప్రాజెక్టును నేనే దగ్గరుండి డిజైన్ చేయించాను. గోదావరికి నడకలు నేర్పాను... అని సిఎం కేసీఆర్‌ గొప్పలు చెప్పుకొంటారు. కనుక దీనికీ ఆయనే బాధ్యత వహించాలి. ప్రాజెక్టు అంచనాలు పెంచేసి వేల కోట్లు దోచుకోవడంపై ఉన్న ఆసక్తి నిర్మాణంపై చూపక పోవడం వలననే రెండు పంప్‌హౌస్‌లు నీట మునిగాయి. అవేకాదు... కాళేశ్వరం బ్యాక్ వాటర్ వలన మంధని పట్టణం నీట మునిగి ప్రజలు కూడా తీవ్రంగా నష్టపోయారు. ఇదంతా కేసీఆర్‌ నిర్వాకమే. ఇప్పుడు ఈ నష్టాన్ని ఆయన భరిస్తారా? చెప్పాలి,” అని నిలదీశారు.