నాగర్‌కర్నూల్ జెడ్పీ ఛైర్ పర్సన్‌పై అనర్హత వేటు

నాగర్‌కర్నూల్ జెడ్పీ ఛైర్ పర్సన్‌ పద్మావతిపై అనర్హత వేటు పడింది. ఆమె 2019లో తెలకపల్లి జిల్లా పరిషత్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి జెడ్పీటీసీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. జెడ్పీ ఛైర్ పర్సన్‌ పదవిని ఎస్సీ జనరల్‌కు కేటాయించడంతో టిఆర్ఎస్‌కు చెందిన పద్మావతి, కాంగ్రెస్ అభ్యర్ధిగా సుమిత్రమ్మ పోటీ పడ్డారు. చివరికి పద్మావతి జెడ్పీ ఛైర్ పర్సన్‌గా ఎన్నికయ్యారు.  

ఆమెపై పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్‌ అభ్యర్ధి సుమిత్రమ్మ పద్మావతి ఎన్నిక చెల్లందంటూ అభ్యంతరం వ్యక్తం చేసారు. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారని, కనుక ఎన్నికల నియామావళి ప్రకారం ఆమెను అనర్హురాలిగా ప్రకటించాలని రిటర్నింగ్ అధికారిని కోరారు. కానీ ఆయన పట్టించుకోకపోవడంతో ఆమె ఎలక్షన్స్ ట్రిబ్యూనల్‌కు ఫిర్యాదు చేశారు. 

అయితే ట్రిబ్యూనల్ తీర్పు రావడం ఆలస్యం అవడంతో ఇంతకాలం పద్మావతి నాగర్‌కర్నూల్ జెడ్పీ ఛైర్ పర్సన్‌గా కొనసాగారు. సుమిత్రమ్మ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టిన ట్రిబ్యూనల్, ఎన్నికల నియామవలి ప్రకారం పద్మావతి ఎన్నిక చెల్లదని తీర్పు చెప్పింది. దీంతో పద్మావతి జెడ్పీ ఛైర్ పర్సన్‌ పదవిలో నుంచి తప్పుకోవలసి వచ్చింది.